విప్లవ చిత్రాల నటుడు, నిర్మాత మాదాల రంగారావు ఇకలేరు. ఈరోజు ఉదయం హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 71. ఆయనకు ఓ కుమారుడు. వారం రోజుల క్రితమే మాదాల రంగారావు శ్వాసకోశ సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేర్పించినట్టు ఆయన కుమారుడు మాదాల రవి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వారం రోజుల నుంచి ఆయన వెంటిలేటర్ మీద వున్నారు. ఈరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. మరికాసేపట్లో ఫిలింనగర్లోని మాదాల రవి ఇంటికి భౌతిక కాయాన్ని తరలించనున్నారు. అంత్యక్రియలు కూడా ఈరోజే నిర్వహించనున్నట్టు సమాచారం.
‘ఛైర్మన్ చలమయ్య’ సినిమాతో నటుడిగా మాదాల రంగారావు కెరీర్ స్టార్ట్ చేశారు. తరవాత ‘యువతరం కదిలింది’ (1980), ‘ఎర్ర మల్లెలు’ (1981), ‘మహాప్రస్థానం’ (1982), ‘ప్రజా శక్తి’ (1983), ‘వీర భద్రుడు’ (1984), ‘స్వరాజ్యం’, ‘మరో కురుక్షేత్రం’, ‘ఎర్ర సూర్యుడు’ తదితర విప్లవ చిత్రాల్లో నటించారు. ఆయనపై నక్సలైట్ ఐడియాలజీ ప్రభావితం చేస్తున్నారనే ముద్ర పడింది. అందుకు “సమాజంలో మార్పే లక్ష్యంగా నేను సినిమాలు తీస్తున్నాను. నక్సలైట్ ఐడియాలజీని పెంపొందించడానికి కాదు’ అని మాదాల రంగారావు చెబుతుండేవారు. హీరోగా నటించడంతో పాటు నవతరం పిక్చర్స్ సంస్థను స్థాపించిన ఆయన పలు సినిమాలు నిర్మించారు.