కర్ణాటక ఎన్నికల తరువాత భాజపా ఢిల్లీ నేతల మాటల్లో ఒక స్పష్టమైన మార్పు, వ్యూహం కనిపిస్తోంది..! కర్ణాటకలో అధికారం దక్కించుకుని, దక్షిణాదిలో కూడా తమ జెండా రెపరెపలాడించాలని మోడీ షా ద్వయం భావించింది. దీంతో 2019 ఎన్నికల ప్రచార హోరును పెంచొచ్చనీ అనుకున్నారు. కానీ, కర్ణాటకలో అనూహ్యంగా కాంగ్రెస్, జేడీఎస్ లు ఐక్యత ప్రదర్శించాయి. భాజపాకి అవకాశం లేకుండా చేశాయి. ఆ తరువాత, ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాజపా వ్యతిరేక రాజకీయ పార్టీలన్నీ ఒకే వేదిక మీదికి వచ్చాయి. కర్ణాటక ఎన్నికల కంటే ముందు ఉత్తరప్రదేశ్ లో కూడా ఉప ఎన్నిక సందర్భంగా ఎస్పీ, బీఎస్పీలు ఐకమత్యం ప్రదర్శించాయి. సో.. ఓవరాల్ గా భాజపాకి అర్థమౌతున్న పొలిటికల్ మూడ్ ఏంటంటే… భాజపా వ్యతిరేక అజెండాతో ప్రాంతీయ పార్టీలు ఐక్యమౌతున్నాయన్నది!
కిం కర్తవ్యం ఏంటంటే తొలిదశలో ఉన్న ఐక్యతారాగాన్ని మలిదశకు చేరకుండా మానసికంగా దెబ్బతీయడం. ప్రస్తుతం భాజపా నేతలు అమలు చేస్తున్న కొత్త మిషన్ ఇదే అని చెప్పొచ్చు! మోడీ పాలన నాలుగేళ్లు పూర్తి చేసి ఐదోయేట అడుగుపెడుతున్న తరుణంలో కీలక నేతల మాటల్లో ఇదే అంశం కామన్ గా కనిపించింది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో భాజపాతో పోరాటం చేసేందుకు కలిసికట్టుగా వచ్చేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయనీ, కానీ వాటి ప్రయత్నాలను ప్రజలు తిప్పి కొడతారన్నారు. అంతేకాదు, సంఘటితం అవుతున్న ప్రతిపక్షాలను అరాచక శక్తులుగా ఆయన అభివర్ణించడం విశేషం. మోడీ వెర్సెస్ ఇలాంటి పార్టీల కూటమి అన్నట్టుగా వచ్చే ఎన్నికలు ఉంటాయన్నారు.
ఇక, భాజపా అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ… ప్రతిపక్షాలన్నీ మోడీని అధికారం నుంచి తప్పించడం కోసమే ప్రయత్నిస్తున్నాయనీ, కానీ భాజపా మాత్రం దేశం నుంచి అవినీతినీ, పేదరికాన్నీ తరిమికొట్టాలని ప్రయత్నిస్తోందన్నారు. ఎన్డీయే బలం ఏమాత్రం తగ్గలేదన్నారు. మరింత పెరుగుతుందని జోస్యం చెప్పారు. కేంద్రమంత్రి నితిన్ గట్కరీ మాట్లాడుతూ… కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షం ఉండటం ప్రజాస్వామ్యానికి శుభ పరిణామం కాదన్నారు. రాహుల్ గాంధీకి ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదన్నారు.
భాజపా నాయకుల మూడ్ ఏంటో ఈ మాటల్లోనే అర్థమౌతోంది. ప్రతిపక్షాలు ఏకమైనా భాజపాకి ఏం కాదనే సంకేతాలు ఇస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అరాచక శక్తులనే ముద్ర వేసే విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు..! భాజపా వ్యతిరేకత శక్తులను ఏకం చేసేందుకు ప్రయత్నించే కాంగ్రెస్ ని కూడా మానసికంగా దెబ్బ తీసేందుకు… రాహుల్ గాంధీని అపరిపక్వ నాయకుడనీ అభివర్ణిస్తున్నారు! ఇదంతా ముందస్తు జాగ్రత్త చర్యగానే కనిపిస్తోంది. పార్టీలన్నీ ఏకమైనా వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రయోజనం ఉండదనే అభద్రతను ఇప్పట్నుంచే పెంచి పోషించేందుకు పునాదులు వేస్తున్నారు.