సాధారణంగా `ఎర్ర` సినిమాలకు సెన్సార్ సమస్యలు వస్తుంటాయి. `ఆ సీన్ కట్ చేయండి.. ఇది కట్ ఛేయండి..` అంటూ సెన్సార్ బోర్డు సభ్యులు హుకుం జారీ చేస్తుంటారు. వాళ్ల నిబంధనలు వాళ్లవి. ప్రభుత్వాలకు, విధానాలకూ వ్యతిరేకంగా ఉన్న ఏ సినిమానీ వాళ్లు ఉపేక్షించరు. దర్శక నిర్మాతలదీ ఏమీ చేయలేని పరిస్థితి. సెన్సార్ నిబంధనల్ని ఒప్పుకుంటే తప్ప సినిమా విడుదల చేసుకోలేరు. అందుకే వాళ్ల షరతులకు తలొగ్గిపోతుంటారు. కానీ మాదాల రంగారావు ఆ టైపు కాదు. సెన్సార్‌ని ఎదిరించిన ధీరుడు. మాదాల సినిమాలన్నీ `ఎర్ర` కథలతో నిండినవే. విప్లవ భావజాలం ఆయన సినిమాల్లో కనిపిస్తుంటుంది. చాలా సినిమాలకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించేవి. అలాంటప్పుడు ఆయన ఏకంగా సెన్సార్‌పై యుద్ధమే ప్రకటించారు. మాదాల నిర్మించిన చిత్రాల్లో మూడు నాలుగు సినిమాలకు సెన్సార్ ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటప్పుడు ఆయన సెన్సార్ బోర్డు ముందే నిరాహార దీక్షకు దిగిపోయేవారు. మాదాల దెబ్బకు.. సెన్సార్ బోర్డే కాదు.. ఏకంగా ప్రభుత్వాలు కూడా దిగి వచ్చేసేవి. సెన్సార్‌ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించిన నిర్మాతగా మాదాల రంగారావు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.