అజ్ఞాతవాసి డిజాస్టర్.. పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్‌ల మధ్య దూరం పెంచిందని టాలీవుడ్లో పెద్ద ఎత్తున గుసగుసలు వినిపించాయి. దానికి తగ్గట్టే… ఆ సినిమా తరవాత పవన్ – త్రివిక్రమ్ కలసి కనిపించలేదు. `ఛల్ మోహన్ రంగ` ఈవెంట్ కి కూడా పవన్ ఒక్కడే హాజరయ్యాడు. దాంతో ఈ గాసిప్‌లో నిజం ఉందేమో అనిపించింది. అయితే త్రివిక్రమ్ మాత్రం అలాంటిదేం లేదు.. అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ఓ దిన పత్రికకు త్రివిక్రమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో `అజ్ఞాతవాసి` గ్యాప్ గురించి ప్రస్తావన వచ్చింది. సినిమాల వల్ల దూరమయ్యే స్నేహం తమది కాదని, ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నామని త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చాడు. ”అత్తారింటికి దారేది సమయంలో ఎలా ఉన్నామో.. ఇప్పటికీ అలానే ఉన్నాం. మా అనుబంధంలో మార్పేం రాలేదు. ఆ సినిమా హిట్టయినప్పుడు నన్ను కౌగిలించుకుని, ముద్దులు పెట్టుకుని, బహుమానాలేం ఇవ్వలేదు. ఈసారి దూరమూ పెట్టలేదు. సినిమాల వల్ల మా మధ్య దూరాలు పెరుగుతాయని ఎప్పుడూ అనుకోం. జయాపజయాలు మమ్మల్ని ఎఫెక్ట్ చేయవు” అని క్లారిటీగా చెప్పేశాడు త్రివిక్రమ్. అంతే కాదు… ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక డిస్టిబ్యూటర్లకు పిలిచి డబ్బులు ఇచ్చేశారట. పవన్ స్పీచులు తాను రాసి ఇవ్వడం లేదని, తనకు రాజకీయాలపై ఎలాంటి అవగాహన లేదని తేల్చి చెప్పాడు ఈ మాటల మాంత్రికుడు. త్రివిక్రమ్ తాజా ఇంటర్వ్యూతో చాలా అనుమానాలకు సమాధానాలు దొరికినట్టైంది.