తిరుమల శ్రీవారి కేంద్రంగా సాగుతున్న రాజకీయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ… రక్షణాత్మక ధోరణిలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ కావడం… రమణ దీక్షితులు ఆరోపణలన్నీ… నేరుగా ప్రభుత్వాన్ని గురి పెట్టి ఉండటమే దీనికి కారణం. అమిత్ షా వచ్చి మంతనాలు జరిపి వెళ్లిన తర్వాతే ఈ రాజకీయం జరిగిందని… అందరికీ తెలిసినా.. రమణ దీక్షితులు ప్రధానంగా ఆరోపణలు చేసిన పింక్ డైమాండ్ విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దాన్ని జెనీవాలో సౌతీబీ అనే వేలం సంస్థ వేలం వేసిందని.. కూడా.. రమణ దీక్షితులు చెప్పుకొచ్చారు. దీన్ని వైసీపీ నేతలు మరింతగా అంది పుచ్చుకున్నారు. శ్రీవారి నగలు చంద్రబాబు దోచుకున్నారని.. చంద్రబాబు ఇళ్లలో సోదాలు చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేరుగా ఆరోపణలు చేశారు.
ఇది ఇలా సాగుతూండగానే.. తిరుమల మాజీ సీవీఎస్వో బీవీ రమణకుమార్ తెర మీదకు వచ్చారు. ఆయన గతంలో తిరుమలలో డాలర్ల మాయం వ్యవహారంపై విచారణ జరిపారు. ఆయన కొన్ని సంచలన విషయాలు బయట పెడుతున్నారు. మూడు రోజులుగా ఆయన వీటిని మీడియాకు చెబుతూనే ఉన్నారు. దాన్ని బట్టి తెలిసిందేమిటంటే.. ఈ పింక్ డైమండ్ లేదా రూబీ మిస్సయిన విషయాన్ని రమణదీక్షితులు అప్పుడే విజిలెన్స్‌కు చెప్పారట. ఈ విషయంపై తాను నివేదిక కూడా ఇచ్చానని రమణకుమార్ చెబుతున్నారు. అప్పట్లో టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవోగా రమణాచారి, ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. అంటే అప్పుడే ఈ డైమాండ్ లేదా రూబీ మిస్సయింది. దీన్నే టీడీపీ నేతలు ఇప్పుడు అస్త్రంగా చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై.. విచారణను ఏపీ ప్రభుత్వం ప్రారంభించవచ్చన్న సూచనలు.. మాజీ విజిలెన్స్ చీఫ్.. మీడియా ముందుకు రావడంతో కనిపిస్తున్నాయి. నిజానికి అది డైమండ్ కాదు.. రూబీనే. భక్తులు నాణాలు విసరడం వల్ల పగిలింది అని కూడా.. స్పష్టంగా నివేదిక ఉంది. కానీ ప్రభుత్వం ఈ విచారణల ద్వారా… టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి చేసిన అక్రమాలను బయటకు తీసి .. ప్రజల ముందు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తిరుమలలో జరిగిన అరాచకాలు కూడా ఈ విచారణతో బయటకు తెస్తారని… రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే.. తిరుమల వివాదం బూమరాంగ్ అయి… నేరుగా వేసీపీనే తగిలే పరిస్థితి ఏర్పడనుంది.