ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలో అన్ని రాష్ట్రాలకు వెళ్లి .. ప్రాంతీయ పార్టీల అధినేతలతో సమావేశమవుతానని మహానాడు వేదికగా ప్రకటించారు. అదీ కూడా పార్లమెంట్ సమావేశాలకు ముందే ఈ పర్యటనలన్నీ పూర్తి చేస్తానని… అందర్నీ కలుపుకుని పార్లమెంట్‌లో పోరాటం చేస్తానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ హక్కులు, ప్రత్యేకహోదా సాధన పోరాటంలో అందరి మద్దతూ కోరుతానని ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలుగు 360 రెండు రోజుల కిందట.. చంద్రబాబు ప్రాంతీయ పార్టీల నేతలందర్నీ కలిసేందుకు రాష్ట్రాల పర్యటనలకు వెళ్లబోతున్నారని… చెప్పింది. ఆ విషయాన్ని మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ధృవీకరించారు.
ప్రాంతీయ పార్టీలతో పాటు.. వామపక్ష పార్టీలు ప్రభుత్వాల్లో ఉన్న రాష్ట్రాలతో పాటు… ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలకూ చంద్రబాబు వెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పోరాటానికి మద్దతుగా అందర్నీ కూడగడుతున్నట్లు…చంద్రబాబు ప్రకటించారు. ఇందులో రాష్ట్ర ప్రయోజనాలతో పాటు… రాజకీయం కూడా ఉంది. ఏపీకి మద్దతుగా అందర్నీ కూడగట్టడటమంటే… ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏం చేయడమే. ఇప్పటికే బెంగళూరులో ..మమతా బెనర్జీ, మాయావతి.. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని చంద్రబాబును కోరినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేసుకున్న..చంద్రబాబు… ప్రాంతీయ పార్టీల కూటమిపై చురుగ్గా… వర్కవుట్ చేస్తేనే మంచిదని నిర్ణయించారు. దాని కోసం.. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన అన్యాయం…అనే కాన్సెప్ట్ రెడీగా ఉంది కాబట్టి.. ఆయన వెంటనే రంగంలోకి దిగబోతున్నారు.
ఆగస్టులో జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు ముందే.. చంద్రబాబు ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అప్పటికే అందర్నీ ఏకం చేసి…కేంద్రంపై.. ఎన్నికలకు ముందు సన్నాహాక సమరం చేయనున్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో… ప్రతి పక్ష పార్టీల మధ్య ప్రస్తుతం ఉన్నంత ఐక్యత లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అందరూ.. ఒకే టాపిక్ మీద.. అది కూడా.. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేసిన అన్యాయం మీద పోరాడటానికి.. చంద్రబాబు ఒప్పించబోతున్నారు. అంటే.. ఓ రకంగా.. మోదీ వ్యతిరేక కూటమి ట్రాక్‌పై ఎక్కుతున్నట్లే. ఆ తర్వాత ఏమిటన్నది.. ఎన్నికల తర్వాత తేలుతుంది..!