నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ బ్రాండ్ లీడర్. కడప జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న ఆయన.. జగన్పై విరుచుకుపడటంలో ఎలాంటి హద్దులూ పెట్టుకోరు. జగన్ చేసే .. ఘాటు విమర్శలకు అంతే ధీటుగా సమాధానం చెబుతారు. రాజకీయాల్లో అది చెల్లుబాటవుతుంది. కానీ అదే తరహా విమర్శలను.. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు… రమణదీక్షితులపై చేశారు సోమిరెడ్డి. ఇటీవలి కాలంలో.. బీజేపీ, వైసీపీల ప్రమేయంతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా…రమణదీక్షితులు ఆరోపణలు చేస్తున్నారని సోమిరెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. అందుకే అసలు కుట్ర ఎవరు చేశారో తేలాలంటే.. ముందుగా “రమణ దీక్షితులను బొక్కలో వేసి నాలుగు తంతే..అన్నీ బయటకు వస్తాయంటూ” ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో రగడ ప్రారంభమయింది.
బ్రాహ్మణుడు కాబట్టే రమణదీక్షితులును .. సోమిరెడ్డి అలా అన్నారంటూ.. వైసీపీ సానుభూతి పరులు కొంత మంది.. సోషల్ మీడియాలో కులం అంటగట్టేశారు. అదే ఇంకెవరిైనా అలా అనగలరా అంటూ.. సోమిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రారభించారు. చినికి చినికి ఇది… పెద్దదైపోయింది. దీంతో సోమిరెడ్డి.. మరింత పెద్దది చేయడం ఇష్టం లేక వెంటనే వివరణ ఇచ్చారు. రమణ దీక్షితులపై తన విమర్శలను.. కులం కోణంలో చూడటం కరెక్ట్ కాదన్నారు. కేవలం శ్రీవారి భక్తుడిగా… ఆయనను అప్రతిష్ట పాలు చేస్తున్నారన్న ఉద్దేశంతో అన్నానే కానీ.. ఈ విషయంలో కులం ప్రస్తావనే లేదంటున్నారు. కానీ.. ఎలా లేదన్నా… శ్రీవారికి ప్రధానార్చకులుగా… 22 ఏళ్ల పాటు పని చేసిన రమణదీక్షితులకు బ్రాహ్మణవర్గంలో ఎంతో కొంత పలుకుబడి ఉంటుంది. దాంతో సోమిరెడ్డి సులువుగా టార్గెట్ అయిపోయారు.
మొత్తానికి టీడీపీ నేతలు.. తిరుమల కేంద్రంగా సాగుతున్న రాజకీయంను ఎదుర్కోవడంలో తడబడుతున్నారు. నాలుగు రోజుల కిందట… రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్.. ఈ వివాదంపై మాట్లాడుతూ…శ్రీవారిని వెంకన్న చౌదరి అని సంబోధించారు. దాంతో.. టీడీపీని వ్యతిరేకించేవారు పండగ చేసుకున్నారు. చివరికి ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు సోమిరెడ్డి ఇరుక్కుపోయారు. ఆయన కూడా వివరణ ఇచ్చారు. రమణదీక్షితులు లెవనెత్తిన వివాదాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో టీడీపీకి కొత్త వివాదాలు వచ్చి పడుతున్నాయి.