ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికలో త్రిముఖ పోరుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాలు టీడీపీ, వైకాపాలతోపాటు, కొత్తగా జనసేనను కూడా సొంతంగా బరిలోకి తెచ్చేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత జగన్ ఇప్పటికే ఎన్నికల మూడ్ లో ఉన్నారు. పాదయాత్ర చేస్తున్నారు. పవన్ కూడా యాత్ర బాటపట్టారు. కానీ, ప్రస్తుతం టీడీపీ పోరాటమంతా భాజపా కేంద్రంగానే జరుగుతోంది. జగన్, పవన్ లపై టీడీపీ ఇంకా పూర్తిస్థాయి దృష్టి సారించలేదనే చెప్పాలి. కానీ, వారు మాత్రం టీడీపీ లక్ష్యంగానే ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నేతల ప్రభావం ప్రజలపై ఎంతవరకూ ఉంటోదని తెలుసుకోవడం కోసం సీఎం చంద్రబాబు ఒక సర్వే నిర్వహిస్తున్నట్టు సమాచారం.
నిజానికి, ఈ సర్వే అత్యంత రహస్యంగా నిర్వహించాలని అనుకున్నారు. కానీ, వివిధ రూపాల్లో ఈ సమాచారం బయట పడిందని తెలుస్తోంది. ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న పాదయాత్ర ప్రభావం, పవన్ ప్రసంగాల వేడి… ఇవి ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయనే అంశమై ఈ సర్వే ద్వారా తెలుసుకునే ప్రయత్నం జరుగుతోందట. సర్వే అంటే ఏవో కొన్ని శాంపిల్స్ తీసుకుని అంచనాకి వచ్చేయడం కాకుండా… వాస్తవ పరిస్థితిని వీలైనంత స్పష్టంగా తెలుసుకునేందుకు బూత్ స్థాయి నుంచీ వివరాలు సేకరణ ఉంటోందని వినిపిస్తోంది. దీంతోపాటు, తెలుగుదేశం పనితీరుపై కూడా సమగ్ర వివరాల సేకరణ జరుగుతోంది. స్థానిక నేతల నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి వరకూ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఈ సర్వే ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సర్వే నిర్వహణ బాధ్యతల్ని నిఘా విభాగానికి అప్పగించడం విశేషం.
నిజానికి, సొంత పార్టీ నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించడం చంద్రబాబుకి అలవాటే. దాని ఆధారంగా ర్యాంకులు ఇస్తుంటారు. తాజా సర్వేలో పవన్, జగన్ ల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడంపై ఫోకస్ పెట్టడం విశేషం. అంటే, ఈ సర్వే ఫలితాల ఆధారంగా తెలుగుదేశం ఎన్నికల వ్యూహరచన ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సర్వే తరువాత వైకాపా, జనసేనలకు ధీటుగా టీడీపీ ప్రచార ప్రణాళిక ఎలా ఉంటుందో చూడాలి.