దేశం అంతా ఇప్పుడు కూటమి రాజకీయాలే నడుస్తున్నాయి. ముఖ్యంగా అటు యూపీఏ ఇటు ఎన్డీఏల్లో లేకుండా తటస్థంగా వ్యవహరిస్తున్న పార్టీలు… కీలకంగా మారాయి. వచ్చే ఎన్నికల తర్వాత ఈ పార్టీలు కీలక పాత్ర పోషించబోతున్నారనే అంచనాలు రావడమే దీనికి కారణం. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసే మిషన్ను చాలా రోజుల కిందటే ప్రారంభించారు. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఆయన అందర్నీ కలుస్తున్నారు కానీ.. పొరుగు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ వైసీపీని మాత్రం కలిసే ఆలోచన చేయలేదు. అసలు వైసీపీ ప్రస్తావనే.. ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లోకి రాలేదు.
ఇక బెంగళూరులో జరిగిన కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి బీజేపీకి వ్యతిరేకించి ప్రాంతీయ పార్టీల నేతలందరూ హాజరయ్యారు. కేంద్రానికి ముఖ్యంగా మోదీకి గట్టి హెచ్చరిక పంపాలన్న ఉద్దేశంతో. ప్రాంతయ పార్టీల నేతలు…ఈ ప్రమాణస్వీకారోత్సవాన్ని వేదిక చేసుకున్నారు. ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీకి ఆహ్వానం పంపారు.. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్కు తప్ప. కనీసం మాట వరుసకు కూడా… ఆహ్వానం పంపలేదు. జగన్ను అటు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ చర్చలకు కానీ…ఇటు ప్రాంతీయ ప్రాంతీయ పార్టీల బలప్రదర్శనకు కానీ.. కనీసం లెక్కలోకి తీసుకోలేదు.
వైసీపీని జాతీయ రాజకీయాల్లో ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. కేసీఆర్ కాంగ్రెస్ అనుకూల పక్షాలను చీల్చడానికి ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ ..బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయి కాబట్టి.. ఆ పార్టీని కొత్తగా కూటమిలో చేర్చే అవసరం లేదని.. కేసీఆర్ భావన అని కొంత మంది విశ్లేషణ. అదే సమయంలో… బీజేపీతో దగ్గరగా ఉంటున్నాడు కాబట్టి.. కర్ణాటకలో కూడా బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశారు కాబట్టి… ఆయనను ప్రాంతీయ పార్టీల కేటగిరిలో వేయాల్సిన అవసరం లేదని.. ప్రాంతీయ పార్టీల కూటమి నేతలు అంచనాకొచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తానికి వైసీపీ మాత్రం.. ఇప్పటికి జాతీయ రాజకీయాల్లో అనామకంగా మిగిలిపోయింది. కేంద్ర ప్రభుత్వ ప్రాపకం కోసం.. వైసీపీ నేతలు..ఢిల్లీలో వేసిన వేషాలో… ఆ పార్టీ పలుకుబడి పడిపోవడానికి ప్రధాన కారణం కావొచ్చు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లొస్తాయన్న అంచనాలు కూడా.. ఆ పార్టీ పేరు పెద్దగా వినబడకపోవడానికి మరో కారణం అంటున్నారు విశ్లేషకులు.