పాపం! ఏ ముహూర్తాన హిందీ హిట్ ‘క్వీన్’ సౌత్ రీమేక్స్ స్టార్ట్ చేశారో గానీ… నిర్మాత మను కుమారన్కి ఆది నుంచి హంసపాదులు ఎదురవుతున్నాయ్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కథానాయికల కోసం మొదట్లో తెగ వెతికారు. తెలుగు, తమిళ భాషల్లో ఒక కథానాయికతో రీమేక్ చేద్దామని అనుకున్నారు. చివరకు తెలుగుకి తమన్నా, తమిళానికి కాజల్ అగర్వాల్, మలయాళానికి మంజిమా మోహన్, కన్నడకి పారుల్ యాదవ్‌లను సెలెక్ట్ చేశారు. తెలుగు, మలయాళ రీమేక్ దర్శకత్వ బాధ్యలను నీలకంఠ చేతిలో… కన్నడ, తమిళ్ రీమేక్ బాధ్యతలను నటుడు రమేశ్ అరవింద్ చేతిలో పెట్టారు. ప్యారిస్ షెడ్యూల్ పర్ఫెక్ట్గా జరిగింది. తరవాతే తిరకాసు మొదలైంది. ఏమైందో ఏమో… తెలుగు వెర్షన్ దర్శకత్వ బాధ్యతలనూ రమేశ్ అరవింద్‌కి అప్పగించారు. మూడు సినిమాల బాధ్యతను మోయలేక ఆయన తెలుగును పక్కన పెట్టేశారు. దాంతో కథ మళ్ళీ కంచికి చేరింది. తాజా సమాచారం ప్రకారం… తెలుగు రీమేక్ వెర్షన్‌కి ప్రశాంత్ వర్మను దర్శకుడిగా తీసుకున్నార్ట!
‘అ!’ సినిమాతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయిన ప్రశాంత్ వర్మ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. తొలి సినిమాతో మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేరాడు. అతనితో చాలామంది హీరోలు పనిచేయడానికి ఆసక్తి కనబరిచారు. అయితే… అతను ‘క్వీన్’ రీమేక్ ఆఫర్‌ని అంగీకరించాడంటే ఆశ్చర్యంగా వుంది. ఆల్రెడీ ఓ దర్శకుడు సగం తీసేసిన సినిమాను పూర్తి చేయడమంటే మాటలు కాదు. బోల్డన్ని సమస్యలు, జనాల్లో సందేహాలు వస్తాయి. నీలకంఠ తీసిన సన్నివేశాలు తీసేసి ప్రశాంత్ వర్మ సినిమా అంతటినీ కొత్తగా తీస్తాడో? మిగతాది పూర్తి చేస్తాడో? వెయిట్ అండ్ సి!!