తెలంగాణలో కొత్త జోనల్ విధానాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఇలా కొత్త కేబినెట్ ఆమోదం తీసుకుని.. అలా ఢిల్లీ వెళ్లిపోయారు. నేరుగా ప్రధానమంత్రిని కలవబోతున్నారు. రాష్ట్రపతితో ఆమోదముద్ర వేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం అందరికీ చెబుతున్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినందున అది అవసరం అంటున్నారు.
నిజానికి 2016 ఆగస్టులో అసలు జోనల్ విధానం తెలంగాణకు అవసరం లేదని తేల్చేశారు. ఉమ్మడి ఏపీ లేనందున .. రాష్ట్రపతి ఉత్తర్వులు తెలంగాణకు వర్తించవన్నారు. తెలంగాణ అన్ని జిల్లా, రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టులే ఉంటాయని ప్రకటించారు. జోనల్ విధానం వద్దని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. ఉద్యోగసంఘాలన్నీ జోనల్ విధానం రద్దుపై సుముఖంగా ఉన్నాయన్నారు. ఇప్పుడు పూర్తిగా మాట మార్చేశారు. శరవేగంగా జోనల్ విధానంపై కసరత్తు పూర్తి చేసి.. రాష్ట్రపతి ఆమోదం కోసం బయలు దేరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసలు జోనల్ విధానమే ప్రాంతీయ వివాదాల వల్ల వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తర్వాత అన్ని ప్రాంతాల వారికి స్థానికత ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యలో రిజర్వేషన్ల కల్పనకుగాను 1973లో రాజ్యాంగ సవరణతో 371 (డి) నిబంధనను తీసుకువచ్చారు. 1974లో ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రాతిపదికన 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వీటి ద్వారా జోనల్, మల్టీ జోనల్, జిల్లా యూనిట్‌తో కూడిన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది.
ఉమ్మడి ఏపీలో.. ఆంధ్ర, తెలంగాణల మధ్య వచ్చిన వివాదం సమసిపోవడానికి .. ఉద్యోగ నియామకాల్లో జోనల్ విధానం తీసుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణనే ప్రత్యేక రాష్ట్రం అయింది. అంటే.. తెలంగాణ ప్రజలు ఆశించినట్లు… ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ.. తెలంగాణ ప్రజలకే వస్తాయి. అలాంటిది అసలు 371 (డి) నిబంధన తెలంగాణకు వర్తించదన్న కేసీఆర్.. ఇప్పుడు హడావుడిగా జోన్ల ప్రస్తావన తెచ్చి.. రాష్ట్రపతి ఆమోదం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారన్నదే ఎవరికీ అర్థం కాని ప్రశ్న..? దీని వెనుక తన మార్క్ విభజన రాజకీయం ఉందా అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి.