భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా… నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై జాతీయ మీడియాలో కాస్త అగౌరవ వ్యాఖ్యలే చేశారు. అమరావతి ప్లాన్లు ఇంకా సింగపూర్ లోనే ఉన్నాయని వెటకారం చేశారు. రాజధాని కోసం ఇంకా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని చెప్పుకొచ్చారు. అసలు నిర్మాణమే ప్రారంభం కాని రాజధానికి డబ్బులెందుకన్నట్లుగా ఆయన మాట్లాడారు. నిజానికి అమిత్ షా చేసిన వ్యాఖ్యలనే..చాన్నాళ్లుగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. మరింత పరుష పదజాలంతో వినిపిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.. ఇప్పటికీ అమరావతిలో ఇంత వరకూ ఒక్క ఇటుకా పడలేదని చెబుతూంటారు. కాస్త అటూఇటుగా అమిత్ షా కూడా… అవే మాటలు చెప్పారు.
నవ్యాంధ్ర రాజధాని అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్‌భవన్, హైకోర్టు లాంటి నిర్మాణాలు మాత్రమేనన్నట్లుగా అమిత్ షా మాట్లాడారు. వాటి నిర్మాణాలు ప్రారంభం కాలేదన్నట్లు తీసి పారేశారు. నిజానికి అమరావతి విషయంలో చంద్రబాబు ఆలోచనలు వేరు. అవకాశాల గనిగా అమరావతిని మార్చాలనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగానే ఆయన చాలా పకడ్బందీ ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. అమరావతిలో మౌలిక సదుపాయాల ఆభివృద్ధి కోసం.. ఇప్పటికే రూ.50 వేల కోట్లతో పనులు జరుగుతున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తోంది. రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వం రాజీపడటం లేదు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు తమ క్యాంపస్‌లు ప్రారంభించాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ కేంద్రప్రభుత్వానికి తెలియకుండా ఉంటాయని అనలేం. కానీ అమిత్ షా కేంద్రం తరపున కాక… బీజేపీ తరపున ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులోనే రాజకీయం ఉందని అర్థమైపోతుంది.
నిజానికి ఆంధ్రప్రదేశ్‌కు రూపాయి రావాలన్నా.. కూడా అమిత్ షా … నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలన్న విమర్శలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న సుజనా చౌదరితో… ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. అమిత్ షా తో చీటీ రాయించుకుని వస్తే నిధులు విడుదల చేస్తానని చెప్పడం సంచలనం సృష్టించింది. దానికి తగ్గట్లుగానే ఏపీకి సంబంధించిన మొత్తం వ్యవహారాలు తానే చూస్తున్నట్లుగా ఆ తర్వాత అమిత్ షా.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖను అసెంబ్లీలో చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇది రాజకీయపరమైన లేఖ అని.. అసెంబ్లీలోఎందుకు చర్చించారని బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ అమిత్ షా అందులో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అని సంబోధిస్తూ లేఖ రాశారు. రాజధానికి ఇచ్చిన రూ. 2,500 కోట్లకు సంబంధించి యుటిలిటీ సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన సమాచారాన్ని కేంద్రానికి పంపింది. వీటిలో విజయవాడ, గుంటూరుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఇచ్చిన వెయ్యి కోట్లు కూడా ఉన్నాయి. ఈ పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి కూడా.
ఇవన్నీ బీజేపీ అగ్రనాయకత్వానికి తెలియకుండా ఉంటాయని అనలేం. అయినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదనలనే… జాతీయ మీడియా ముందు కూడా.. కాస్త వ్యంగ్యంగా అమిత్ షా చెప్పడం తెలుగునాట బీజేపీపై మరింత ఆగ్రహం పెరగాడానికి కారణమవుతోంది. కుట్ర చేస్తున్నారన్న టీడీపీ నేతల వాదనలకు వారే బలం చేకూరుస్తున్నారన్న అభిప్రాయం వ్యయక్తం అవుతోంది.