కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి… నిమ్మకూరులో ప్రకటించిన తర్వాత రేగిన రాజకీయ దుమారం అంతా ఇంతా కాదు. జగన్ ప్రకటనలను.. ఆయన పార్టీ నేతలే ఖండించారు. జగన్ కులాల మధ్య రచ్చ పెట్టే ప్రయత్నం చేసి.. రాజకీయ లబ్ది పొందాలనుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. తర్వాత ఆ విషయం సద్దుమణిగింది. అయితే ఇప్పడు ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నేత పురంధేశ్వరి.. మళ్లీ ఇదే డిమాండ్‌ను వినిపించారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయనకు ఘన నివాళులర్పించిన పురేందేశ్వరి.. కాస్తంత రాజకీయంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. అందులో ఒకటి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న డిమాండ్.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు అనే డిమాండ్ పురందేశ్వరి నోటి నుంచి రావడంతోనే చాలా మంది టీడీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ లేని విధంగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన డిమాండ్‌ను ఆమె బలపరచడమే .. వారి ఆశ్చర్యానికి కారణం. నిజానికి ఎన్టీఆర్‌కు గౌరవం ఇవ్వాలనుకుంటే.. అది కృష్ణా జిల్లాకు పేరు పెట్టడంతో రాదని…టీడీపీ నేతలు చాలా కాలంగా వాదిస్తున్నారు. రాజకీయంగా ఎన్టీఆర్‌ను వివాదాస్పదం చేసే ప్రయత్నాల్లో ఉన్న జగన్‌కు పురంధేశ్వరి మద్దతుగా నిలవడాన్ని నందమూరి అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎన్టీఆర్‌కు నిజమైన గౌరవం భారతరత్న పురస్కారంతోనే వస్తుందని నందమూరి అభిమానులు ఇప్పటికీ నమ్ముతున్నారు. పురంధేశ్వరి యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. గాంధీ కుటుంబానికి సన్నిహితురాలిగా మెలిగారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌కు భారతరత్న విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఆమె బీజేపీలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రావడంతోనే.. అటల్ బిహారీ వాజ్‌పేయి, మదన్ మోహన్ మాలవీయకు భారతరత్న ప్రకటించింది. కానీ ఎన్టీఆర్ గురించి పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పుడు సీరియస్‌గా.. ప్రతిపాదనలను పంపినా పట్టించుకోలేదు. ప్రతీ విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తున్న బీజేపీ … ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే.. ఆ క్రెడిట్ ఎక్కడ టీడీపీకి వెళ్తుందో అన్న ఉద్దేశంతో పక్కన పెట్టేసింది. ఈ విషయంలో పురంధేశ్వరి కూడా.. చొరవ చూపించలేదు.
ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టి.. కేవలం ఒక్క జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న అంశాన్ని పెద్దది చేసే ప్రయత్నం పురంధేశ్వరి చేస్తున్నారు. దీని వల్ల ఓ యుగపురుషుని గౌరవాన్ని తగ్గించడమే కానీ… పెంచడం ఏ మాత్రం కాదని… టీడీపీ నేతలే కాదు.. నందమూరి అభిమానులు కూడా భావిస్తున్నారు. మహానుభావుడైన తండ్రి… గొప్పదనానికి తగ్గ గౌరవానికి ప్రయత్నించాలి కానీ.. రాజకీయానికి వాడుకోవడం సరికాదంటున్నారు. మరి పురుంధేశ్వరి.. భారతరత్న కోసం ప్రయత్నిస్తారా..? కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు కోసం పోరాడుతారో వేచి చూడాల్సిందే.. !