తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు టీడీపీకి దూరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాను ఆశించిన గవర్నర్ పదవి రాలేదన్న అసంతృప్తితో ఆయన దశలవారీగా టీడీపీకి దూరమౌతూ వచ్చారు. ఇటీవల జరిగిన మహానాడుకు ఆయన్ని పిలవకపోవడంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతీ తెలిసిందే. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ టీడీపీపై ఆరోపణలు చేస్తున్న మోత్కుపల్లి వాఖ్యాలకు టీ టీడీపీ నేతలు కూడా ఇప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబుపై విమర్శలు చేయడంతో ఆగ్రహిస్తున్నారు.
ప్రత్యర్థుల చేతిలో మోత్కుపల్లి కీలుబొమ్మగా మారారు అంటూ ఆరోపించారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. పార్టీనీ పార్టీ అధినేత చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత సండ్రకి లేదని ఆయన అన్నారు. గవర్నర్ పదవి విషయంలో చంద్రబాబు చాలా ప్రయత్నించారనీ, చివరికి భాజపా నేతల దగ్గరకి కూడా మోత్కుపల్లిని తీసుకెళ్లారన్నారు. ఆయనకి పదవి రాకపోతే టీడీపీ ఏం చేస్తుందనీ, భాజపా ఆయనకి గవర్నర్ గిరీ ఇవ్వకపోతే చంద్రబాబుకి ఏంటి సంబంధమని సండ్ర అన్నారు. తెలుగుదేశం పార్టీని తెరాసలో విలీనం చేయాలని మాట్లాడిన మోత్కుపల్లిని మహానాడుకు ఎలా ఆహ్వానిస్తామన్నారు. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదనీ, ఆయనే దూరమైపోయారని సండ్ర విమర్శించారు.
నిజానికి, టీడీపీ మీద కోపంతో తెరాసను హైలైట్ చేసే విధంగా మోత్కుపల్లి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు కూడా! ఆయన్ని చూస్తుంటే ఎన్టీఆర్ గుర్తొస్తున్నారనీ అనేశారు కదా. పేదోడిని కేసీఆర్ రాజ్యసభకు పంపించారన్నారు. అంటే, పరోక్షంగా తనకు గవర్నర్ పదవి దక్కకపోయినా, రాజ్యసభ సీటు కూడా పార్టీ ఇవ్వలేదన్న అక్కసు వెళ్లగక్కారు. కేవలం పదవులు దక్కలేదన్న అసంతృప్తితో పార్టీకి దూరమౌతున్నారు. కానీ, తనకు పదవి దక్కకపోవడం వెనక టీడీపీ చేసిన అన్యాయం ఏమైనా ఉందా అనేది ఆయన ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని కొందరు టీడీపీ నేతలూ అంటున్నారు. ఏపీ ప్రయోజనాలను సాధించుకునే క్రమంలో భాజపాతో టీడీపీ వైరం పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం, టీడీపీ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఏపీ కేంద్ర మంత్రులు కూడా పదవుల్ని వదులుకోవాల్సి వచ్చింది. పార్టీ అంతా ఒకటే అనుకున్నప్పుడు… ఈ పరిస్థితిని కూడా మోత్కుపల్లి పరిగణనలోకి తీసుకోవాలి కదా అనేది టీ టీడీపీ నేతల్లో వ్యక్తమౌతున్న అభిప్రాయం.