తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త గురువొచ్చాడు. అపారంగా ఉన్న అవకాశాలను కూడా నిరుపయోగం చేసుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్‌ను గాడిలో పెట్టడానికి … రాహుల్ గాంధీ చివరికి పాత కాపు గులాం నబీ ఆజాద్ పైనే ఆధారపడ్డారు. కుంతియా స్థానంలో… తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను… గులాంనబీ ఆజాద్‌కు అప్పగించారు. ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో.. ఆజాద్ నియామకం..తెలంగాణ కాంగ్రెస్ లో కచ్చితంగా ఉత్సాహం తెస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నిజానికి కాంగ్రెస్‌లో సమర్థులు, సీనియర్లు అయిన నేతలకు కొదవలేదు. కానీ వారి మధ్య ఐక్యతే ఉండదు. కోమటిరెడ్డి చెప్పినట్లు… ఆయనతో సహా..అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే. అలాంటి నేతలు ఉన్న… పార్టీని కుంతియా సమర్థంగా నడిపించలేకపోయారు. అందర్నీ ఏక తాటిపైకి తేవడంలో విఫలమయ్యారు. అందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉండటంతో పార్టీ పరిస్థితి స్తబ్దంగా తయారయింది.
దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక తర్వాత అంతో ఇంతో… బలం నిలబెట్టుకంటున్న రాష్ట్రం తెలంగాణనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడదీస్తే.. కనీసం తెలంగాణలో అయినా కొన్ని సీట్లు వస్తాయన్న ఆశతో.. కాంగ్రెస్ ఏపీని విడగొట్టిందన్న ప్రచారం ఉంది. కానీ ఆ పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా అయిపోయింది. ఏపీలో భూస్థాపితం అయితే.. తెలంగాణలో ఘోరంగా పరాజయం పాలైంది. అయితే టీఆర్ఎస్ కు ధీటుగా సంస్థాగత బలం ఉండటంతో అధికారం కోసం పోటీ పడే పరిస్థితిలో ఉంది. కానీ నాయకుడు లేకపోవడం వల్లే అసలు సమస్య వచ్చి పడింది. రేవంత్ రెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీలో చేరినా.. పరిస్థితి మెరుగుపడకపోవడానికి కారణాలేమిటని… హైకమాండ్ ఆరా తీసింది. నేతల మధ్య …సరైన సమన్వయం లేదని తేలడంతో.. ఆ సమస్య పరిష్కారానికి ఆజాదే కరెక్టని డిసైడయ్యారు. త్వరలో పీసీసీలోనూ పూర్తి స్థాయి మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దానికి ముందుగా ఆజాద్ పార్టీ పరిస్థితిపై కొంత కసరత్తు చేయనున్నారు.
వచ్చే ఏడాది తెలంగాణలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. పార్టీ పరిస్థితిని ఎలాగైనా మెరుగుపర్చాలన్న ఉద్దేశంతో ఆజాద్ ను తెలంగాణకు పంపినట్లు సమాచారం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జ్ గా గులాం నబీ ఆజాద్ వ్యవహరించిన అనుభవం ఉంది. కేసీఆర్.. వ్యుహాలను తట్టుకోవాలంటే… బలమైన వ్యూహకర్త అవసరమని.. కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. మరి ఆజాద్.. ముఖ్యమంత్రి అభ్యర్థులందర్నీ.. ఏక తాటిపైకి తెస్తారో… మొత్తానికే కాడి పడేస్తారో వేచి చూడాలి..!