రైతులకు ఎంత సాయం చేసినా తక్కువే. ఎకరానికి రూ. 8 వేలు ఇవ్వడం మంచిదే. రైతులకు మేలు జరుగుతుంది కాబట్టి కచ్చితంగా ఆహ్వానించాల్సిందే. అయితే లోపాలు సవరించాలి. లోపాలు సవరించకుండా పథకం అమలు చేస్తే పెద్ద ప్రయోజనం ఉండదు. ఈ పథకం పేరు “రైతు బంధు”. కానీ రైతులందరూ.. భూమి యజమానులు కాకపోవచ్చు. అలాగే భూ యజమానులందరూ.. రైతులు కాకపోవచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కల కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. కొన్ని వేల ఎకరాలు కొనుగోలు చేశారు. వారి ఉద్దేశం వ్యవసాయం చేయడం కాదు. చేయడం లేదు కూడా. కానీ భూముల్ని కొనిపెట్టారు. వచ్చే డిమాండ్ కు అనుగుణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు. వీళ్లందరూ కోటీశ్వరులే అయి ఉంటారు. వీరికి కూడా పెట్టుబడి సాయం అవసరమా..?
ఓ వ్యక్తికి రూ. ఆరు లక్షల రైతు బంధు పథకం సొమ్ము వచ్చింది. అంటే.. 150 ఎకరాల భూమి ఉందని అర్థం. చట్టాలను ఉల్లంఘించి.. రకరకాల జిమ్మిక్కులతో భూములను.. తమ అధీనంలో ఉంచుకున్నారు. వ్యవసాయం చేయకుండా.. కేవలం భూయాజమాన్య హక్కులు ఉన్నందు వల్ల.. రూ. వెయ్యి కోట్ల రూపాయలు .. రైతులు కాని వారికి వెళ్లాయి. రైతుల సాయం కోసం ఉద్దేశించిన ఈ పథకం.. ..” భూ యజమనుల బంధు” పథకంగా ఎందుకు మారాలి..? ఖజానాకు ఎందుకు భారంగా మార్చుకోవాలి..?. వీరికి సాయం చేయకుండా ఆపడం అంత అసాధ్యమా..?
1. కౌలు రైతులకెందుకు “రైతు బంధు” వర్తించదు..?
నిజమైన రైతులకు ఈ పథకం అందడం లేదు. ఇరవై నుంచి ముఫ్పై శాతం మంది కౌలు రైతులు తెలంగాణలో ఉన్నారు. వారెవరికీ.. ఈ పథకం అందడం లేదు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్లో అత్యధికులు కౌలు రైతులు. కారణం.. పంట పండినా రాకపోయినా.. నగదు రూపంలో యజమానికి కౌలు చెల్లించాల్సిందే. ఇలాంటి కౌలు దారులకు రైతు బంధు పధకం అమలు కావడం లేదు. కౌలుదారుల్ని గుర్తించడం అంత అసాధ్యమేం కాదు. గ్రామసభలు పెట్టి సమాచారం సేకరిస్తే.. ఎవరు కౌలు రైతో తెలిసిపోతుంది. భూపాలపల్లి జిల్లాలో ఒక్క కుటుంబానికే… 850 ఎకరాల భూమి ఉంది. వీరికి ఎలా రైతు బంధు పథకాన్ని ఎలా అమలు చేస్తారు..?
2. అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారు రైతులు కాదా..?
తెలంగాణలో వేల ఎకరాల అటవీ భూములున్నాయి. ఈ అటవీ భూముల్ని తరతరాలుగా… గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి… వారికి పట్టాలుండవు. వారికి భూములపై హక్కులు ఇచ్చే చట్టాలేవీ అమలు కావడం లేదు. వీరంతా.. భూములు సాగు చేసుకుంటున్నారు. రైతులే… కానీ..వారికి భూములపై యాజమాన్య హక్కులు లేవు. దశాబ్దాలుగా వారు.. భూములు సాగు చేసుకుంటున్న రైతులే..కానీ వారికి రైతుబంధు పథకాన్ని అమలు చేయడం లేదు. ఎందుకు అమలు చేయరు..?
3. పట్టాల్లేని భూముల్లో సాగు చేసుకుంటే రైతులు కారా..?
తెలంగాణలో ఉన్న సాగు భూముల్లో 25లక్షల ఎకరాలకు పట్టాల్లేవు. ఈ రైతు బంధు పథకం ఈ ఇరవై ఐదు లక్షల ఎకరాలకు.. రైతు బంధు పథకం అమలు కాదు. ఈ భూమిలో రైతులు పంటలు పండించుకుంటున్నారు. భూ యాజమాన్య హక్కు ఇవ్వకపోయినా.. సాగు చేసుకుంటున్న రైతులకు ఎందుకు సాయం చేయరు..?
4. చట్టాల్లో ఇరుక్కుపోయిన భూములు సాగు చేసుకుంటున్న వారి పరిస్థితేమిటి..?
కాందిశీకులు, ఇనాం, బంజరు భూముల్లో పంటలు పండించే రైతులకు ఎవరికీ కూడా ఈ రైతు బంధు పథకం అమలు కావడం లేదు. వీరు కూడా రైతులే కదా..? వీరికెందుకు సాయం చేయరు..? గిరిజనుల ప్రాంతాల్లో గిరిజనులకే హక్కులుంటాయి. ఇతరులకు హక్కులు ఉండవు. అయితే ఆయా ప్రాంతాల్లో గిరిజనేతరులు కూడా..పంటలు పండించుకుంటున్నారు. వాళ్లు కూడా లక్షల సంఖ్యలో ఉంటారు. వాళ్లేమీ భూములపై యాజమాన్యహక్కులు అడగడం లేదు. పెట్టుబడి సాయం మాత్రమే అడుగుతున్నారు.
అంటే రైతుబంధు పథకం చెక్కులు పొందుతున్న వారిలో అత్యధికులు.. భూస్వాములు,పారిశ్రామికులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులుకే అందుతోంది. ప్రభుత్వం చెబుతున్న సమస్యలకు సంబంధించి సింపుల్గా గ్రామసభ పెడితే… పరిష్కారం లభిస్తుంది.