టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం తనకెంతో ఇష్టమని పవన్ కల్యాణ్.. నాలుగు నెలల కిందటి వరకు చెప్పారు. ఆయన అనుభవానికే తాను మద్దతిచ్చాన్నారు. కానీ ఇప్పుడు మాట మారిపోయింది. చంద్రబాబులో పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు అవినీతి మాత్రమే కనిపిస్తోంది. అనుభవంతో కూడిన అవినీతి … త్రీడీలో కనిపిస్తోంది. అందుకే.. తన టూర్లో సెటైర్లు, విమర్శలు దంచి కొడుతున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో చంద్రబాబు చేసిన అవినీతి ఏంటో.. తాను ఒక్కసారిగా ముఖ్యమంత్రిపై ఒపీనియన్ మార్చుకోవడానికి కారణమేంటో మాత్రం పవన్ కల్యాణ్ చెప్పడం లేదు. ఒకప్పుడు తనకు అనుభవం లేదని.. అందుకే ముఖ్యమంత్రి పదవికి తొందర లేదన్నారు. ఓ విధంగా ఆ పదవికి తాను అర్హుడ్ని కాదని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం తానే ముఖ్యమంత్రినంటున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో ఆయన అంతగా ఏం అనుభవం సంపాదించారని సుతిమెత్తని సెటైర్లు చుట్టుపక్కల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి.
మిత్రపక్షంగా జనసేనకు తెలుగుదేశం పార్టీ.. సహకరించింది. జనసేన అధినేత ఏ సమస్య లెవనెత్తినా పరిష్కారం చూపే ప్రయత్నం చేసింది. దాంతో తెలుగుదేశం పార్టీకి… తోక పార్టీలా జనసేన అయిపోయిందని పవన్ అనుభవంతో తెలుసుకున్నారా..? అధికార పార్టీ మీద విరుచుకుపడితేనే… ప్రతిపక్షానికి భవిష్యత్ ఉంటుందని నమ్మారా..? ప్రతి దానికి వ్యతిరేకిస్తే.. తప్ప… ప్రతిపక్షాలకు ఫ్యూచర్ ఉండదని వ్యూహకర్తలు చెప్పారా..? అన్న సందేహాలు.. టీడీపీతో పాటు జనసేన వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు పార్టీల ప్రకారం జరిగినా.. ముఖ్యమంత్రి ఎవరన్నదానిపైనే ఓటింగ్ ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రి రేసులో తాను లేనని.. తనకు ముఖ్యమంత్రి పదవి ఆసక్తి లేదని ప్రజలు భావిస్తే.. కనీసం తన సామాజికవర్గం ఓట్లు కూడా పడే అవకాశం ఉండదు. చంద్రబాబు, వైఎస్ జగన్ మధ్య పోటీ అన్నట్లు ఎలక్షన్లు జరిగితే.. జనసేన ఓట్ షేర్ కూడా పడిపోతుంది. దాంతో అసలు పార్టీ మనుగడకే దెబ్బపడుతుంది. ఈ విషయాన్ని అనుభవంతో పవన్ కల్యాణ్ గ్రహించడం వల్లే… ముఖ్యమంత్రి రేసులో తానున్నానని ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి పదవిపై ఆలోచనల్లో మార్పు రావడానికి కొంత మంది రహస్య మిత్రుల … సపోర్ట్ కూడా కారణమన్న అంచనాలున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనను దూరం చేస్తే..టీడీపీకి గడ్డు పరిస్థితేనని… కొంత మంది చాలా కాలంగా విశ్లేషిస్తున్నారు. టీడీపీని దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో ఎలాగైనా.. జనసేనను టీడీపీకి దూరం చేసేందుకు .. చేసిన ప్రయత్నాల్లో ఫలించడం వల్లే..పవన్ ఆలోచనల్లో మార్పొచ్చినట్లు తెలుస్ోతంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే…పవన్ రాజకీయ అనుభవాల కారణంగానే .. చంద్రబాబు అనుభవం.. అవినీతిగా కనిపిస్తోందన్నది చాలా మందిలో ఉన్న అభిప్రాయం.
–సుభాష్