అనూహ్య పరిణామాల మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. నిజానికి, ఆయన్ని సీఎం చేసిందే కాంగ్రెస్ పార్టీ. భాజపాని అడ్డుకోవాలన్న ఒకే ఒక లక్ష్యంతో తమకంటే తక్కువ సీట్లు గెలుచుకున్న జేడీఎస్ కి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అంతేగానీ, కుమార స్వామి అంటే ప్రత్యేకమైన అభిమానం లేదు. గతంలో కూడా రెండు పార్టీల మధ్య అంతటి సుహృద్భావ వాతావరణం కూడా లేదు. కనీసం ఎన్నికల ముందైనా ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నదీ లేదు. కాబట్టి, తుమ్మితే ఊడిపోయే ముక్కులా మారింది కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి. అందుకే, ఆయన ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
సోమవారం నాడు కుమారస్వామి ఢిల్లీలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతో కూడా ఆయన భేటీ అయ్యారు. నిజానికి, రాహుల్, సోనియాలు ఢిల్లీలో లేకపోయినా… ఈయన మాత్రం అక్కడే చక్కర్లు కొడుతున్నారు. ఎందుకంటే, ఓపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాతో రాష్ట్ర అవసరాలు ఎలాగూ ఉంటాయి. కలవక తప్పదు. ఇంకోపక్క, కర్ణాటక కాంగ్రెస్ నేతల నుంచి ఒక వాదన వినిపిస్తోంది! జేడీఎస్ కంటే ఎక్కువ స్థానాలు మనం దక్కించుకున్నప్పుడు… ఐదేళ్లపాటు కుమారస్వామికి సీఎం పదవి ఎందుకు వదిలెయ్యాలి, ఆ పార్టీ చెప్పినట్టు మనం ఎందుకు నడుచుకోవాలనే వాదన బలంగా వినిపిస్తోంది. కనీసం మూడేళ్లపాటు సీఎం పదవి తమకే ఉండాలంటూ కొంతమంది రాష్ట్ర నేతలు హైకమాండ్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో కుమారస్వామికి భవిష్యత్తు అర్థమైపోయింది! ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి స్థానంలో తాను కొనసాగే పరిస్థితి ఉండదనేది స్పష్టమౌతోంది.
దీంతో కుమారస్వామి కొంత నిర్వేదంతో ఉన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరుగుతూ, వారిని ఒప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవం చూసుకున్నట్టయితే, జేడీఎస్ ను కర్ణాటక ప్రజలు తిరస్కరించారు. ఉత్తర కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాల్లో చూసుకుంటే జేడీఎస్ కు ఆదరణ లేనే లేదు. ఎన్నికల ఫలితాల్లో కూడా మూడో స్థానానికి పరిమితమైన పార్టీ. కాకపోతే, కొన్ని ప్రత్యేక పరిస్థితులు మధ్య కుమారస్వామి సీఎం అయ్యారు అంతే! వాస్తవ పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి, సీఎం హోదాను ఆయన మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేని పరిస్థితి. అందుకే, ఢిల్లీ వెళ్లి… రాష్ట్ర నేతలను కాస్త కంట్రోల్ లో పెట్టాలనే అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కి చెప్పాలనే ప్రయత్నంలోనే ఉన్నారు. అలాగని, ఆ మాటను నేరుగా చెప్పేంత ధైర్యం కూడా చాలని పరిస్థితి ఉంది. అందుకే, ఏం చెయ్యాలో తెలియక కుమార స్వామి కొంత నిర్వేదంలో ఉన్నట్టు సమాచారం.