వీలైనన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు, లోక్ సభ ఎన్నికల్ని కలిపి నిర్వహిస్తామని కేంద్రం ఎప్పటికప్పుడూ చెబుతూ ఉంటుంది. అంతేకాదు, సాధ్యాసాధ్యాలు పరిశీలించాలంటూ గతంలో ఓసారి ప్రధాని మోడీ కూడా అధికారులకు ఆదేశాలిచ్చారు. అయితే, కర్ణాటక ఎన్నికలు పూర్తయ్యాక ముందస్తుపై కొంత స్పష్టత వస్తుందని అనుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో భాజపాకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలపై భాజపా పునరాలోచనలో పడుతుందా అనే చర్చ మొదలైంది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో విలేకరులతో చిట్ చాట్ చేసిన భాజపా అధ్యక్షుడు అమిత్ షా, ఈ టాపిక్ మాట్లాడారు.
ముందస్తు ఎన్నికలు ఉండే అవకాశం ఉండకపోవచ్చన్నారు. రాజస్థాన్, ఛత్తీస్ గడ్ వంటి రాష్ట్రాలు ఎన్నికలు యథావిధిగా జరుగుతాయనీ, వాటికీ లోక్ సభలో లింక్ ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని తమకి బలంగానే ఉందనీ, కాకపోతే ఆ మేరకు రాజ్యాంగంలో కొంత వెసులుబాటు లేకుండా ఉందన్నారు. ఆ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోందన్నారు. కొన్ని రాష్ట్రాలను ఒప్పించాల్సి ఉంటుందనీ అమిత్ షా అన్నారు. ఇవన్నీ ఆఫ్ ద రికార్డ్ గా కొంతమంది మీడియా మిత్రుల ముందు ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయంగా తెలుస్తోంది.
నిజానికి, కర్ణాటకలో కూడా భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉంటే… ఈపాటికే ముందస్తు ఉత్సాహం భాజపాలో కనిపించేది. త్వరలో రాజస్థాన్ వంటి భాజపా పాలిత రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్నాయి. వాటి ఫలితాలపై భాజపాకి కొంత టెన్షన్ మొదలైన మాట వాస్తవమే. అందుకే, భాజపా పాలిత రాష్ట్రాల్లో పరిస్థితిపై స్పష్టత వస్తే… అదే సమయంలో లోక్ సభ ముందస్తు గురించి కూడా ఆలోచించే అవకాశం కచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముందస్తు ఉండదన్నట్టు ప్రస్తుతం అమిత్ షా మాట్లాడుతున్నా… పరిస్థితి బాగానే ఉందీ, అంతా అనుకూలంగా కనిపిస్తోందీ, ప్రతిపక్షాలూ ప్రాంతీయ పార్టీలూ తమకి వ్యతిరేకంగా కూటమి కట్టేంత సమయం ఇవ్వొద్దని అనుకుంటే, లోక్ సభ ఎన్నికలూ వెళ్లిపోవచ్చే నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ఆ దృక్పథంతోనే నాలుగేళ్ల మోడీ పాలనపై పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా భారీగా ప్రచారం చేస్తున్నారు. సంపర్క్ సమర్థన్ అంటూ మోడీ ప్రభుత్వ విజయాలను ప్రజలకు చేరువ చేసే కార్యక్రమం మొదలుపెడుతున్నారు. దీంతో, ప్రస్తుతం అమిత్ షా చెప్పిన మాటల్ని పూర్తిగా విశ్వసించలేని పరిస్థితి కనిపిస్తోంది.