తెలుగుదేశం పార్టీ … ప్రత్యేకహోదా విషయంలో విబేధించి… ఎన్డీఏకు గుడ్‌బై చెప్పింది. నిజానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి వెళ్లిపోయేలా.. అమిత్ షా, నరేంద్రమోదీ ప్రణాళిక ప్రకారం వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, విజయసాయిరెడ్డికి పీఎంవోలోకి ఫ్రీయాక్సెస్ ఇవ్వడం లాంటివి చంద్రబాబును అసహానికి గురి చేశాయి. అదే సమయంలో ప్రత్యేకహోదా ఇచ్చేది లేదంటూ… ఏపీ ప్రభుత్వానికి చెబుతూ… మరో వైపు వైసీపీ, జనసేనలతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని సెంటిమెంట్ ఎగదోస్తున్నారని.. టీడీపీ నిర్ణయించుకుంది. ఈ కుట్రలన్నింటిని బయటపడటానికి ఎన్డీఏ నుంచి వైదొలగడమే మంచిదని నిర్ణయం తీసుకున్నారు.
ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చిందో.. అప్పుడే..జాతీయ రాజకీయాల్లో సమూలమైన మార్పులు కనిపించడం ప్రారంభించాయి. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమయ్యాయి. చంద్రబాబు చొరవ కొంత.. కలసి వచ్చిన పరిస్థితులు మరికొంత కలిపి.. ఇప్పుడు బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఎదురుగా నిలబడింది. దీంతో బీజేపీలో ఎక్కడ లేని టెన్షన్ ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ బయటకు వెళ్లడం వల్లనే ప్రస్తుతం ఎదురులేని పరిస్థితి నుంచి ఎదురీదే పరిస్థితికి వచ్చామన్న చర్చ బీజేపీలోనడుస్తోంది.
టీడీపీని బయటకు నెట్టేయడంలో కీలకంగా వ్యవహరించిన అమిత్ షా మాత్రం… టీడీపీ వల్ల, చంద్రబాబు వల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని మీడియాకు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నేతలు ప్రభావం చూపించలేరని ఆయన వాదన. కానీ నేతలందరూ కలసికట్టుగా ఉంటే… ఉమ్మడిగా ప్రజలపై ప్రభావం మాత్రం ఉంటుంది. ఆ మాత్రం తెలియని రాజకీయ నేత కాదు అమిత్ షా. కానీ టీడీపీ వల్ల నష్టం జరుగుతోందని అంగీకరించకూడదన్నదే ఆయన మాటల సారాంశం.
ఇక బీజేపీ మాజీ అధ్యక్షుడు .. ప్రస్తుత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్..తెలుగుదేశం పార్టీ… ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లడం.. ఏ మాత్రం సంతోషించదగ్గ పరిణామం కాదంటున్నారు. తెలుగుదేశం పార్టీపై ప్రత్యేకహోదా లాంటి ఒత్తిళ్లు ఉన్నా… తమ ప్రభుత్వం వాటికి సామరస్య పరిష్కారం చూపించాల్సిందన్నారు. రాజ్‌నాథ్.. ఈ విషయంలో అమిత్ షా కంటే భిన్నమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
ఇప్పటి వరకు.. మోదీ – షా తీసుకున్న నిర్ణయాలపై కానీ.. అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలపై కానీ.. ప్రశ్నించడానికి… చర్చించడానికి కానీ.. ఏ బీజేపీ నేత కూడా సాహసించేవారు కాదు. కానీ తొలి సారి రాజ్‌నాథ్… వారు తీసుకున్న నిర్ణయం నష్టమేనన్నట్లుగా మాట్లాడారు. ముందు ముందు బీజేపీకి గడ్డు పరిస్థితి ఖాయమన్న సూచనలు ఎక్కువయ్యేకొద్దీ.. బీజేపీలో ధిక్కార స్వరాలు.. మరింత బలం పుంజుకునే అవకాశాలున్నాయి.