సమస్యలపై అధ్యయనం కోసమే జిల్లాల్లో పర్యటిస్తున్నానని వీ వీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే, ఈ పర్యటనల అనంతరం ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొన్న సంగతి తెలిసిందే. తన కార్యాచరణ ఏంటనేది కూడా ఆయన సూటిగా స్పష్టంగా చెప్పలేదు. అలాగని, జనసేనలో చేరబోతున్నారనీ, టీడీపీ కండువా కప్పేసుకుంటున్నారనే ఊహాగానాలను కూడా నిర్ద్వంద్వంగా ఖండించడమూ లేదు. తనకు సంబంధం లేని విషయాలపై స్పందించాల్సిన అవసరమేముంది అంటూ నర్మగర్భంగానే మాట్లాడుతూ వస్తున్నారు. అయితే, ప్రస్తుతం తన విధివిధానాలపై కొంత స్పష్టత ఇచ్చే విధమైన వ్యాఖ్యలే ఆయన చేశారు.
నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ… తాను అధ్యయనం చేసిన సమస్యల్ని ప్రభుత్వం ముందు ఉంచుతానన్నారు. వీటిపై ప్రభుత్వం స్పందించి, పరిష్కార మార్గాలు చూపిస్తే తన స్పందన ఒకలా ఉంటుందనీ, నిర్లక్ష్యం చేసి పక్కన పడేస్తే తన ప్రయాణం మరోలా ఉంటుందని లక్ష్మీనారాయణ చెప్పడం విశేషం. అంటే, తన ప్రజాసేవా ప్రస్థానాన్ని ప్రభుత్వ స్పందనే డిసైడ్ చేస్తుందని చెప్పినట్టు. ఓరకంగా సున్నితమైన హెచ్చరికగా కూడా ఈ మాటలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా కూడా లక్ష్మీనారాయణ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అధికారం లేకుండా సమస్యల పరిష్కారం సాధ్యమా అని విలేకరులు అడిగితే… సాధ్యమే అని తాను నమ్ముతున్నానని అన్నారు. ఒక స్థాయిలో సమస్యకు పరిష్కారం లభించనప్పుడు, రెండో స్థాయికి వెళ్లి ప్రయత్నించాల్సి ఉంటుందన్నారు. అవసరాన్ని బట్టీ రెండో మార్గంలో సమస్యలకు పరిష్కారాలు సాధిద్దామని కూడా చెప్పారు.
ఏదేమైనా, తన ప్రజాసేవా ప్రస్థానంపై త్వరలోనే ఆయన స్పష్టత ఇవ్వడానికి దాదాపు సిద్ధమైనట్టున్నారు. నిజానికి, ప్రత్యేకంగా అధ్యయనం చేస్తే తప్ప అర్థం కాని అంశాలంటూ ఆయనకి ఏముంటాయి..? కాకపోతే, అంతా ప్రణాళికబద్ధంగా జరగాలనే ఆలోచనతో దశలవారీగా తానేం చేయబోతున్నాననేది చెప్పుకుంటూ వస్తున్నారు. మొన్నటివరకూ సమస్యలపై అధ్యయనం అన్నారు. ఇవాళ్ల వాటిని ప్రభుత్వం ముందుంచుతా, ప్రభుత్వ స్పందనను అనుసరించే తన నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసేశారు. ఆ నిర్ణయమేంటో వేచి చూడాల్సిందే.