హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ ఆత్మహత్యపై జరుగుతున్న రాజకీయాలలో ఇంతవరకు బీజేపీ ఆత్మరక్షణకే పరిమితమవుతూ, తనపై వస్తున్న ఆరోపణలకు సంజాయిషీలు చెప్పుకోవడానికే పరిమితమయింది. ఆ షాక్ నుండి తేరుకొని ఇప్పుడు ఎదురుదాడి చేయడం మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహంతోనే దాని మిత్ర పక్షాలు, అనుబంద సంస్థలు, అంబేద్కర్ విద్యార్ధుల సంఘం వంటి విద్యార్ధి సంఘాలు దేశంలో మత అసహనం ప్రచారం మొదలుపెట్టాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసమే మత సహనం, బీఫ్ వివాదం సృష్టిస్తే అది యూనివర్సిటీలకు కూడా పాకి చివరికి విద్యార్ధుల మధ్య ఘర్షణలకు దారి తీస్తోందని అన్నారు.
జి.హెచ్.ఎం.సి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రోహిత్ మృతిపై రాద్ధాంతం చేస్తోందని ఆయన ఆరోపించారు. పార్టీ ప్రయోజనాల కోసం సమాజంలో దేశ వ్యతిరేకతను ప్రోత్సాహించడం చాలా ప్రమాదకర ఆలోచన అని అన్నారు. అటువంటి ధోరణులు ప్రబలుతున్నందునే కొందరు విద్యార్ధులు ఉగ్రవాదంవైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. ఏ రాజకీయ పార్టీకయినా దేశ ప్రయోజనాలు, భద్రత కంటే ఏదీ ముఖ్యం కారాదని అన్నారు. కొన్ని సంస్థలు దేశాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తుంటే మరికొన్ని ఉగ్రవాదానికి ఊతం ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధులు ఈ రాజకీయ చదరంగంలో పావులుగా మారకుండా ఉజ్వల భవిష్యత్ కోసం తమ చదవులపై మాత్రమే దృష్టి పెట్టాలని మురళీధర రావు కోరారు.
మురళీధర రావు చెపుతున్న ఈ మాటలలో కొంత వాస్తవం ఉన్నా అవి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లేఖలో వ్యక్తం చేసిన అభిప్రాయాలనే బలపరుస్తున్నట్లున్నాయి. కనుక భావ ప్రకటన స్వేచ్చకు బీజేపీ వ్యతిరేకమనే ప్రతిపక్ష పార్టీల వాదనకు బలం చేకూర్చుతున్నట్లుంది. ఈ వ్యవహారం ఇంతవరకు రావడానికి బీజేపీ మంత్రులిరువురూ ప్రదర్శించిన అత్యుత్సాహం ఒక కారణమనుకొంటే, విద్యార్ధి సంఘాలు, యూనివర్సిటీ యాజమాన్యం మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం మరొక కారణమని భావించవచ్చును. రోహిత్ మానసిక సంఘర్షణకు గురవుతున్న విషయాన్నీ పి.హెచ్.డి. చేస్తున్న అతని తోటి విద్యార్ధులు పసిగట్టలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కారణాలు ఏవయితేనేమి ఉజ్వల భవిష్యత్ ఉన్న ఒక విద్యార్ధి అన్యాయంగా బలయిపోయాడు. అయినా కూడా రాజకీయ నేతలు అందుకు ఏ మాత్రం చింతించకుండా అతని మరణాన్ని కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకొంటున్నారు.
డిల్లీ నుండి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రావడమే ఇందుకు ఒక ఉదాహారణగా చెప్పుకోవచ్చును. వారిరువురూ మోడీ ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు కనుకనే హడావుడిగా హైదరాబాద్ వచ్చి బీజేపీ మంత్రులపై, కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించేరని భావించవచ్చును. రాహుల్ గాంధి రావడం వలన కాంగ్రెస్ పార్టీకి జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ఎంతో కొంత కలిసిరావచ్చుననే దురాలోచన కూడా ఆయన రాకకు ఒక కారణమని భావించవచ్చును.
ఈ వ్యవహారంలో బీజేపీ మంత్రులిరువురూ అత్యుత్సాహం ప్రదర్శించిన మాట వాస్తవం. కానీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ గురించి ఎరిగిన వారెవరూ ఆయన విద్యార్ధుల జీవితాలను బలితీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆవిధంగా లేఖ వ్రాసారని నమ్మబోరు. బీజేపీకి అనుబందంగా పనిచేస్తున్న ఏ.బి.వి.పి. విద్యార్ధి సంఘం నేతలు ఆయనను తప్పు దారి పట్టించినందునే ఆ విధంగా లేఖ వ్రాసి ఉండవచ్చును. అది రోహిత్ మరణానికి దారి తీయడం చాలా దురదృష్ట పరిణామమే. ఇంత జరిగిన తరువాత బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు ఆ లేఖలో అంశాలను బలపరుస్తున్నట్లుగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది.