ఢిల్లీ నుంచి భాజపా నేతలు రావడం, ఆంధ్రాకి చాలా చేసేసి అలిసిపోయామని ఇక్కడికి వచ్చి ఆపసోపాలు పడటం అనేది ఒక రొటీన్ కార్యక్రమం అయిపోయింది. సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే భాజపాతో దోస్తీని టీడీపీ వదులుకుందని చెప్పడమూ పరమ రొటీన్ గా మారింది. ఇప్పటికే ఆంధ్రాకి ఇచ్చిన హామీల్లో 85 శాతం పూర్తి చేశామనే ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ విజయవాడ వచ్చారు. ఆయన కూడా అదే మాట మాట్లాడారు. దాంతోపాటు, ప్రత్యేక హోదా అడగొద్దు అనే విషయాన్ని అన్యాపదేశంగా చెప్పడం గమనార్హం!
ఆంధ్రప్రదేశ్ పై ప్రధాని మోడీకి ఎలాంటి వివక్షా లేదన్నారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకి వెళ్లిపోయిందన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ, 2014 ఎన్నికల సమయంలో మోడీ హామీ ఇచ్చారు కదా అని విలేకరులు ప్రశ్నిస్తే… ఆ విషయంలో మోడీ వెనకడుగు వెయ్యలేదనీ, హోదా బదులుగా సమానమైన సదుపాయాలున్న ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామన్నారు. హోదా ఎందుకు ఇవ్వనట్టు అంటే… గతంలో తమ హయాంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశామనీ, ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వలేదనీ, వారూ అడగలేదని గుర్తు చేశారు. ఇక, పోలవరం గురించి మాట్లాడుతూ, ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని విమర్శించారు. టీడీపీ సర్కారు వైఖరి వల్లనే ఆలస్యమౌతోందని ఆరోపించారు.
వారు ఏర్పాటు చేసిన రాష్ట్రాలు హోదా అడగలేదు కాబట్టి, ఏపీకి కూడా ఇవ్వలేదనే లాజిక్ చెప్పారు! మరి, 2014కు ఎన్నికల సమయంలో ఈ లాజిక్ మోడీకి గుర్తులేదా..? అంతకు కొన్నేళ్లముందే ఆ మూడు రాష్ట్రాలూ ఏర్పడ్డాయే..? వారికి ఇవ్వలేదు కాబట్టి, ఏపీకి ఎందుకు అని అప్పుడు అనిపించలేదా..? అయినా, ఏపీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య విభజన జరిగిన రాష్ట్రం. అందుకే ప్రత్యేక సాయం అవసరం. ఆ సంగతి కేంద్రానికి తెలుసు కదా! సరే, హోదాకి బదులుగా ఇచ్చిన ప్యాకేజీ ఏదీ..? రెండేళ్ల కిందట ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం నిధులు విడుదల చేసి ఉంటే, ఈ రోజున ఏపీలో భాజపాని వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది..?
ఢిల్లీ నుంచి వచ్చే భాజపా నేతలందరికీ అలవాటైపోయిన మాట ఏంటంటే… సొంత ప్రయోజనాల కోసమే ఎన్డీయేతో టీడీపీ పొత్తు తెంచుకుందని..! ఆ ప్రయోజనాలేంటో ఒకంట్రెండు మచ్చుకి చెప్తే బాగుంటుంది కదా! భాజపాతో వైరం పెట్టుకోవడం వల్ల, కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రం పోరాటానికి దిగడం వల్ల టీడీపీకి మేలు జరుగుతుందన్న కోణం ఎక్కడుంది..? ముఖ్యమంత్రిపై కేసులు పెడతారంటూ బెదిరింపులు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కత్తింపులు, ఇతర పార్టీల నేతల్ని ఎగేస్తూ ఆరోపణలు, హోదా విషయంలో సర్కారు చిత్తశుద్ధిని ప్రశ్నించే విమర్శలు… ఈ ప్రయోజనాలు ఆశించేనా ఎన్డీయేతో టీడీపీ తెగతెంపులు చేసుకున్నది..? వీటిల్లో టీడీపీకి రాజకీయంగా ప్రయోజనకారిగా మారిన అంశాలు ఏమున్నాయి..? ఈ రకమైన లబ్ధి ఆశించే ఎన్డీయేకి టీడీపీ దూరమైందా..?