ఈ మధ్య వార్తల్లో ప్రముఖంగా నిలిచిన రెండు సంఘటనలు… పెళ్లయిన కొన్ని రోజులకే భర్తను చంపించేసిన భార్య, పెళ్లై నెల దాటకుండా బైక్ మీద వెళ్తూ భర్త పీక కోసి చంపిన భార్య! ఇలా భర్తలను చంపేయడం అనే వార్తలు ఈ మధ్య కాస్త ఎక్కువగా వస్తున్నాయి. వీటిపై అనూహ్యంగా స్పందించారు ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి. మహిళలకు మహిళా కమిషన్ ఉన్నట్టుగానే, మగాళ్ల కోసం పురుష కమిషన్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఈ మేరకు ప్రధానికి ఓ లేఖ రాశానని కూడా చెప్పారు.
సమస్య అంతా టీవీ సీరియల్స్ వల్లనే వస్తోందనీ, భర్తలను ఎలా చంపాలీ, ఏం చెయ్యాలనేది వారు చాలా జాగ్రత్తగా చూపిస్తున్నారని నన్నపనేని అన్నారు. భర్తలనీ, ప్రేమికులనీ, తండ్రిని చంపడం వంటివి చూపిస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ చూసీచూసీ కొంతమంది ఆచరణలో పెడుతున్నారన్నారు. ఇలాంటి ఘటనలను తాను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాననీ, అలాంటి కుటుంబాలకి సానుభూతి తెలుపుతున్నాను అన్నారు. ఉత్తరాంధ్రలో భార్యల చేతుల్లో బలైన భర్తల కుటుంబాలని తాను కలుస్తాననీ, పరామర్శించి వారికి అండగా నిలబడతా అన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, పురుష కమిషన్ పెట్టాలన్నారు. ఈ మాట వినగానే విలేకర్లు నవ్వితే… ‘మీరు నవ్వుతున్నారుగానీ, నాకు చాలా బాధగా ఉంది. ఇలాంటి రోజులు వచ్చాయని మీరు నవ్వుకుంటున్నారు’ అని నన్నపనేని చెప్పారు. భార్యా బాధిత సంఘాలను తాను హైదరాబాద్, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో చూశానన్నారు. కానీ, ప్రభుత్వం కూడా పురుష కమిషన్ వేయాల్సిన అవసరం ఉందని ఆమె డిమాండ్ చేశారు.
ఈ మధ్య వరుసగా చోటు చేసుకుంటున్న ఇలాంటి ఘటనల నేపథ్యంలో, నన్నపనేని అభిప్రాయపడ్డట్టు పురుష కమిషన్ అవసరమేమో అనిపిస్తోంది..! ఇంకోపక్క, టీవీ సీరియల్స్ తీరుపై కూడా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాటికి కూడా సెన్సార్ పెట్టాల్సిన అవసరం ఉందని కూడా నన్నపనేని అంటున్నారు. నన్నపనేని వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఏమంటాయో చూడాలి. సరే, వారి వాదన ఎలా ఉన్నాసరే… పురుషులపై దాడులు అనేది ఈ మధ్య పెరిగాయన్నది వాస్తవం. కమిషన్ అవసరమా లేదా అనే చర్చ పక్కనపెడితే.. ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి హింసా ప్రవృత్తిని తీసుకెళ్లే కార్యక్రమాలపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరమైతే కనిపిస్తోంది.