రియలిస్టిక్ అప్రోచ్ అనే మాట తరచూ వింటుంటాం. కానీ బాలీవుడ్లోనే చూసే అవకాశం దక్కుతుంది. ఉన్నది ఉన్నట్టు తీయడం ఒక పద్ధతి. దానికి కల్పన జోడించి.. గ్లోరిఫై చేసి చెప్పడం మరో పద్ధతి. బయోపిక్ అనగానే రెండో దానికే ఓటేస్తారు. ఎందుకంటే మనకు నిజాల కంటే, అందంగా అమర్చిన అబద్ధాలే ఎక్కువ ఇష్టం. ‘మహానటి’ బయోపిక్ బాక్సాఫీసు దగ్గర వసూళ్లనీ, మనసుల్నీ గెలుచుకుంది. కానీ ఆ కథలో నిజం ఎంత? అంటే.. – టక్కున చెప్పలేం. బయోపిక్ కంటే.. ఓ కథగా నచ్చింది. అంతే.
ఇప్పుడు బాలీవుడ్ లో సంజయ్ దత్ బయోపిక్ తెరకెక్కుతోంది. సంజూ పేరుతో. ఓ కథలో ఎన్ని మలుపులు, ఎన్ని ఎత్తులూ, పల్లాలూ, ఎన్ని గెలుపులూ,ఎన్ని అవమానాలూ ఉండాలో అవన్నీ సంజయ్ దత్ కథలో ఉన్నాయి. సంజూ కథ తెరచిన పుస్తకం. దాయనడానికి ఏమీ లేదు. దాచుకోవడానికీ ఏమీ మిగల్లేదు. ఏ అనుమానం వచ్చినా సంజూని కలసి నివృత్తి చేసుకుని, దాన్ని సినిమాగా మలిచే అవకాశం ఉంది. అందుకే రాజ్‌కుమార్ హిరాణీ సంజూ కథని బయోపిక్ తీయడానికి ఎంచుకున్నాడు. రాజ్‌కుమార్ మామూలు దర్శకుడు కాదు. యావత్ భారతదేశం ఆశ్చర్యపడే సినిమాల్ని తీశాడాయన. ఇప్పుడు సినిమాలు తీస్తున్న ఏ దర్శకుడ్నయినా `మీ ఫేవరెట్ ఎవరు` అని అడిగి చూడండి. రాజ్‌కుమార్ పేరు చెబుతారు. ఆయనేం పుంకాను పుంకానులుగా సినిమాలు తీయలేదు. తీసినవి కొన్నయినా అలా నిలబడిపోయాయి. అందుకే సంజూ సినిమాని హిరాణీ తీస్తున్నాడనగానే… అందరూ ఆ సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు.
ఇప్పుడు ట్రైలర్ వచ్చింది. ఈ సినిమాలోని ఎమోషన్, డ్రామా, ఎంటర్టైన్మెంట్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి ట్రైలర్ ఓ ఉదాహరణగా మిగిలిపోతుంది. సంజూ జీవితంలోని ఏ కోణాన్నీ హిరాణీ వదల్లేదు అనడానికి ఈ ట్రైలరే నిదర్శనం. ఏ హీరో తన డ్రగ్ అలవాట్ల గురించి, విచ్చల విడిగా చేసిన శృంగారం గురించీ, జైలు గోడల మధ్య అనుభవించిన నరకం గురించి చెప్పుకుంటాడు? సంజయ్ దత్ చెప్పుకున్నాడు. దాన్ని హిరాణీ తన స్థాయిలో ఓ దృశ్యకావ్యంగా మలిచాడు. వీరిద్దరూ ఒక ఎత్తయితే… రణబీర్ కపూర్ మరో ఎత్తు. సంజయ్ దత్‌ని పెట్టి సినిమాగా తీశారా..? అన్నంత భ్రమ కలుగుతుంది కొన్ని షాట్స్ లో రణబీర్‌ని చూస్తుంటే..! మొత్తమ్మీద… రాజ్‌కుమార్ హిరాణీ నుంచి మరో అద్భుతం రాబోతోందన్న హింట్ ఈ ట్రైలర్‌తో అందేసింది. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ మొత్తం బయోపిక్ ఫీవర్‌తో ఊగిపోతోంది. దాని ఉధృతి ‘సంజూ’ మరింత పెంచుతుందన్న నమ్మకం కలుగుతోంది.