ధొలేరా.. గుజరాత్ లో నిర్మాణ దశలో ఉన్న పారిశ్రామిక నగరం. దాదాపు 5,600 ఎకరాల కోర్ ఏరియాతో నిర్మితమౌతున్న ఈ నగరానికి ఇబ్బడిముబ్బడిగా నిధులు మంజూరౌతున్న సంగతి తెలిసిందే. ధొలేరాపై చూపుతున్న ప్రేమలో కొంతైనా అమరావతిపై ఎందుకు లేదని ఏపీ సీఎం చేసిన విమర్శలపై భాజపా జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు స్పందించారు. ధొలేరాపై విమర్శలు చేయడం టీడీపీ దిగజారుడు తనమని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే ధొలేరా సిటీ నిర్మాణ నిర్ణయం జరిగిందనీ, ఇది తమ ప్రభుత్వం వచ్చి చేసిన నిర్ణయం కాదన్నారు. దీన్ని అమరావతితో పోల్చడం అర్థలేనితనం అన్నారు.
దేశవ్యాప్తంగా ఎనిమిది పారిశ్రామిక నగరాలు నిర్మిస్తుంటే, దాన్లో భాగంగా గుజరాత్ లో ఉన్నది ధొలేరా ఒక్కటే అని జీవీఎల్ చెప్పారు. దీని కోసం కేంద్రం ఇచ్చింది గ్రాంటు కాదనీ, పెట్టుబడి మాత్రమేనని స్పష్టం చేశారు. ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందే అన్నారు. భాజపా ప్రభుత్వం వచ్చాక కొత్తగా పారిశ్రామిక నగరాలు అభివృద్ధి చేస్తోందన్నారు. దానిలో అత్యధికంగా లాభం పొందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. కొత్తగా ఐదు కారిడార్లు డెవలప్ చేస్తున్నామన్నారు. వీటిలోని బెంగళూరు-చెన్నై కారిడార్ లో ఏపీలోని కృష్ణపట్నం కూడా ఉందన్నారు. ధొలేరా మాదిరిగానే దీన్నీ అభివృద్ధి చేస్తారని చెప్పారు. 12 వేల ఎకరాలు అవసరమైతే ఇప్పటికే 1600 ఎకరాలు సేకరించారనీ, మిగతాది సేకరిస్తారన్నారు. ధొలేరా తరహాలోనే దీనికి కూడా దాదాపు రూ. మూడు వేల కోట్లు కేంద్రం ఇస్తుందన్నారు.
విశాఖ – చెన్నై కారిడార్ లో ఇలాంటి నగరాలను మరో రెండు అభివృద్ధి చేయబోతున్నారనీ, విశాఖపట్నం, విజయవాడ కూడా ఉన్నాయన్నారు. అంటే, గుజరాత్ కి ఒక ధొలేరా వస్తే… ఆంధ్రాకి మూడు రాబోతున్నాయన్నారు జీవీఎల్. ఇవన్నీ చాలా నిశ్శబ్ధంగా చేసుకుంటున్నారనీ, కానీ అన్నీ తమ ఖాతాలో వేసుకుంటున్నారనీ, తద్వారా గొప్పలు చెప్పుకుందామని టీడీపీ చూస్తోందన్నారు. విజయవాడ, విశాఖ విషయంలో ప్రణాళికలు సిద్ధమౌతున్నాయన్నారు. ఏపీ మీద ప్రేమ ఉండబట్టే కేంద్రం ఇవన్నీ చేస్తోందన్నారు. ఇక, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల గురించి మాట్లాడుతూ… అవి దుర్వినియోగానికి గురౌతున్నాయనీ, అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి, ఆచితూచి విడుదల చేస్తున్నారని వెనకేసుకొచ్చారు. అంటే, ఏపీకి నిధులు ఇవ్వడం లేదన్న అంశాన్ని పరోక్షంగా అంగీకరించారని అనుకోవచ్చు.
జీవీఎల్ లాజిక్ ప్రకారం ధొలేరా గత కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిందే. కానీ, దానికి అవసరమైన నిధులూ అవస్థాపన సౌకర్యాలను భాజపా అందిస్తోంది కదా! మరి, ఇదే లాజిక్ ఆంధ్రాకి ఎందుకు వర్తింపజేయడం లేదు..? విభజన హామీలన్నీ కాంగ్రెస్ హయాంలో చేసినవే కదా, విభజన చట్టం అప్పటిదే కదా, భాజపా ప్రతిపక్షంలో ఉండగానే ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు కదా.! ఏపీకి వచ్చేసరికి కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, హామీలను భాజపా ఎందుకు అమలు చేయడం లేదు..? గుజరాత్ లాంటి ధొలేరాలు ఆంధ్రాకి మూడు ఇస్తే… గుజరాత్ లో జరిగినంత వేగంగా ఇక్కడ ఎందుకు నిర్మాణ పనులు జరగడం లేదు..?