హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య చేసుకొనే ముందు ఆరు పేజీలతో ఒక లేఖ వ్రాసాడు. దానిలో అతను తను ప్రాతినిధ్యం వహిస్తున్న అంబేద్కర్ విద్యార్ధి సంఘంతో సహా ఇతర సంఘాల గురించి వ్రాసినది వాస్తవాలకు అద్దం పడుతోంది.
“అది ఏ.ఎస్.ఏ. లేదా ఎస్.ఎఫ్.ఐ. లేదా మరో విద్యార్దీ సంఘం కావచ్చును. అన్నీ కూడా తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయి తప్ప విద్యార్ధుల గురించి పట్టించుకోవు. ఈ యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న వివిధ విద్యార్ధి సంఘాలలో నేతలు అందరినీ ఆకట్టుకొని ఏవిధంగా పైకి ఎదుగుదామాని ఆలోచిస్తుంటారు. మనవల్లే ఈ సమాజం మారుతుందని అతిగా ఊహించేసుకొంటూ తరచూ ఒకరినొకరు దెబ్బ తీసుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ రెండు విద్యార్ధి సంఘాల కారణంగానే నాకు సమాజం పట్ల, అద్భుతమయిన సాహిత్యం పట్ల మంచి అవగాహన ఏర్పడిందని చెప్పకతప్పదు,” అని రోహిత్ తన సూ సైడ్ నోట్ లో వ్రాసారు.
ఆ లేఖలో అతను ఇంకా ఏమి వ్రాసారో పోలీసులు బయటపెట్టలేదు. కానీ ఆ ఆరు పేజీల లేఖలో ఈ చిన్న భాగం మాత్రం ఎలాగో మీడియాకి చిక్కింది. ఈ వ్యవహారంలో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న ఇద్దరు బీజేపీ మంత్రులను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఇది మీడియాకు లీక్ చేసి ఉన్నా ఆశ్చర్యం లేదు. అయితే ఈ చిన్న పేరాలో విద్యార్ధి సంఘాల గురించి రోహిత్ వెలువరిచిన అభిప్రాయలు వాస్తవాలకు అద్దం పడుతున్నాయని చెప్పవచ్చును.
దీనిపై రాజకీయ శాస్త్ర విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ హరగోపాల్ దీనిపై ఈ విధంగా స్పందించారు. “రోహిత్ చాలా తెలివయిన విద్యార్ధి. అతను దేశంలో రాజకీయాలు ఏవిధంగా సాగుతున్నాయో బాగా అర్ధం చేసుకొన్నాడు. ఒకవేళ పరిస్థితులు ఇదే విధంగా కొనసాగినట్లయితే దళితులకు సమాజంలో మిగిలిన వారితో సమానంగా ఎదిగే అవకాశం ఉండదని గ్రహించేడు. అందుకే అతను తన ఆత్మహత్య ద్వారా దళితులు ఎదుర్కొంటున్న ఈ వివక్ష గురించి యావత్ దేశానికి ఒక బలమయిన సందేశం ఇవ్వాలని భావించినట్లున్నారు,” అని అన్నారు.
ఇంత వివక్ష ఎదుర్కొని, ఇంత మానసిక వేదన అనుభవించి, ఇంత ఆగ్రహం తనలో పొంగి పొర్లుతున్నా కూడా అతను తన సూ సైడ్ నోట్ లో ఎవరినీ నిందించకపోవడం అతని మానసిక పరిణతికి అద్దం పడుతోంది. అందుకే కొన్ని విద్యార్ధి సంఘాల పేర్లను వ్రాసి మళ్ళీ కొట్టివేశాడు. తన ఆత్మహత్య ద్వారా సమాజానికి ఒక బలమయిన సందేశం ఇవ్వాలని భావించాడే తప్ప తనని చూసి వేరొకరు ప్రేరణ పొందకూడదనే ఉద్దేశ్యం అతని లేఖలో స్పష్టంగా కనబడింది. రోహిత్ వంటి మంచి తెలివయిన, సమాజం పట్ల మంచి అవగాహన కలిగిన విద్యార్ధిని కోల్పోవడం నాకు చాలా బాధ కలిగిస్తోంది,” అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.
రోహిత్ స్నేహితులలో ఒకరు అతని మరణంపై స్పందిస్తూ “సమాజంలో దళితుల పట్ల నెలకొన్న ఈ వివక్షా భావం ఎన్నటికీ మారే అవకాశం లేదనే అభిప్రాయం కూడా అతనిని ఆత్మహత్య చేసుకొనేందుకు పురికొల్పి ఉండవచ్చును. అందుకే అతను ఈ పరిస్థితులను చూసి చాలా విరక్తి చెంది ఆత్మహత్య చేసుకొన్నాడని నేను అనుకొంటున్నాను,” అని అన్నాడు.