దేశవ్యాప్తంగా జరిగిన నాలుగు లోక్‌సభ, పదకొండు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి నిరాశ జనక ఫలితాలు ఎదురయ్యాయి. పోలింగ్ జరిగిన నాలుగు లోక్‌సభ సీట్లలో ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించగలిగింది. నాలుగు పార్లమెంట్ సీట్లలో రెండు మహారాష్ట్ర, ఒకటి ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. వీటిలో ఒక్కటి మాత్రమే బీజేపీ గెలుచుకోగలిగింది. ముఖ్యంగా ఉత్తరప్రదదేశ్లోని కైరానా పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఓటమి.. ఆ పార్టీకి కచ్చితంగా హైరానా పుట్టించేదే. ఎందుకంటే.. అది బీజేపీ సిట్టింగ్ సీటు. అక్కడి ఎంపీ హఠాన్మరణంతో ఉపఎన్నిక వచ్చింది. గత ఎన్నికల్లో బీజేపీ ఆ సీటును దాదాపుగా రెండు లక్షల ఓట్ల మెజార్టీతో దక్కించుకుంది. ఇప్పుడు ఆ రెండు లక్షలకు తోడు మరో లక్ష మైనస్ అయింది. చనిపోయిన ఎంపీ కుటుంబసభ్యులకే టిక్కెట్ ఇచ్చింది. ఆ సానుభూతి కూడా పని చేయలేదు. కొంత కాలం కిందట జరిగిన ఉపఎన్నికల్లో కంచుకోటల్లాంటి గోరఖ్‌పూర్, పుల్పూర్ లోక్‌సభ సీట్లను బీజేపీ కోల్పోయింది. ఈ రెండూ.. బీజేపీ సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామా చేసిన లోక్‌సభ నియోజకవర్గాలు.
ఉత్తరప్రదేశ్‌లో ఉన్న మొత్తం 80 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గత ఎన్నికల్లో 71 స్థానాలు గెలుచుకుంది. ఈ కారణంగానే.. బీజేపీకి కేంద్రంలో పూర్తి మెజార్టీ వచ్చింది. ఆ ఫలితాలను అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ రిపీట్ చేసింది. కానీ ఆ తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలన్నీ ఏకమయ్యాయి. బద్ద శత్రువల్లాంటి.. ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపాయి. కాంగ్రెస్ కూడా సై అంది. దాంతో బీజేపీ వ్యతిరేక ఓట్లన్నీ సంఘటితమయ్యాయి. ఇది బీజేపీకి పెద్ద సవాల్‌గా మారింది. కంచుకోటలు కూడా.. విపక్షాల ఐక్యత దెబ్బకు కుప్పకూలిపోతున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కనీసం అతి పెద్ద పార్టీగా నిలవాలన్నా.. యూపీలో వీలైనన్ని ఎక్కవ స్థానాలను గెలపొందాల్సి ఉంటుంది.
ఇక వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. బీజేపీ రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు తమకే పట్టం కట్టారని.. అన్యాయంగా తమను అధికారానికి దూరం చేశారని.. హంగామా చేసిన బీజేపీకి.. రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక షాక్ ఇచ్చింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏకంగా 44,500 ఓట్ల మెజార్టీ వచ్చింది. కర్ణాటకలో అధికారం కోసం బీజేపీ చేసిన ప్రయత్నాలతో.. అక్కడి ఓటర్లలో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని భావిస్తున్నారు. నాగాలాండ్‌లో బీజేపీ అనైతిక రాజకీయాలు చేసింది. బీజేపీతో పొత్తును వ్యతిరేకించి… ఎన్డీపీపీ పార్టీని పెట్టుకున్న కొంత మంది నాగాలాండ్ నేతలు.. ఇప్పుడు ఆ పార్లమెంట్ సీటును కైవసం చేసుకున్నారు. దాంతో అక్కడా బీజేపీకి వ్యతిరేకత వచ్చినట్లయింది.
కాంగ్రెస్ పార్టీకి ఈ ఉపఎన్నికలు కాస్త ఊరటనిచ్చాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నాలుగు అసెంబ్లీ సీట్లలో గెలిచింది. మొత్తంగా చూస్తే విపక్షాల ఐక్యతతో బీజేపీకి పెద్ద సవాల్‌గా మారిందని చెప్పవచ్చు. అది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చూసుకున్నా.. దేశం మొత్తం చూసుకున్నా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఓ రకంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీస్‌గా అనుకున్న ఉపఎన్నికల్లో బీజేపీ… ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయినట్లే. మరి ఫైనల్‌కు బీజేపీ ఎలాంటి వ్యూహాలను సిద్దం చేసుకుంటుందన్నదానిపై.. 2019 రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.