వరుసగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తున్న యూ.వీ.క్రియేషన్స్ బ్యానర్ లో శర్వానంద్ సురభి జంటగా నటించిన ఎక్స్ ప్రెస్ రాజా సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాకి మేర్లపాక గాంధి దర్శకత్వం వహించారు. డిక్టేటర్, నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయన వంటి పెద్ద సినిమాలతో పోటీపడి సంక్రాంతి పండుగకి విడుదలయిన ఎక్స్ ప్రెస్ రాజా కలెక్షన్లు ఆ మూడు పెద్ద సినిమాల కారణంగా మొదట్లో ఆశించిన దానికంటే కొంచెం తక్కువగా ఉన్నా వారం రోజుల వ్యవధిలోనే పుంజుకోవడం విశేషమే.
భారత్, అమెరికా రెండు దేశాలలో కలిపి ఫస్ట్ వీక్ లో ఆ సినిమా మొత్తం రూ 6.36 కోట్లు వసూలు చేసింది. ఇంకా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఈ సినిమా కలెక్షన్ వివరాలు అందవలసి ఉంది. పెద్ద సినిమాల కలెక్షన్లతో పోలిస్తే ఈ కలెక్షన్లు చాలా తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, చాలా తక్కువ బడ్జెట్ తో తీయబడిన ఆ సినిమాకి ఇది చాలా సానుకూలమయిన విషయమేనని చెప్పవచ్చును. ఇదే జోరు మరికొన్ని రోజులు కొనసాగినట్లయితే, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టడం ఖాయం.
ఫస్ట్ వీక్ కలెక్షన్ వివరాలు: నైజం: రూ.2.10 కోట్లు, సీడెడ్: రూ. 0.60కోట్లు, తూర్పు గోదావరి: రూ.56 లక్షలు, పశ్చిమ గోదావరి: రూ.42 లక్షలు, గుంటూరు: రూ.70 లక్షలు, కృష్ణ: రూ.40 లక్షలు, నెల్లూరు: రూ.14.43 లక్షలు.
అమెరికాలో ఫస్ట్ వీక్ కలెక్షన్ వివరాలు: మొత్తం రూ.69.78 లక్షలు (గ్రాస్: రూ. 2,07,99,250, ఖర్చులు పోగా షేర్: రూ.69,78,250).