తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులుగా ఇరవై నాలుగేళ్ల పాటు వ్యవహరించిన రమణదీక్షితులు ఇప్పుడు రాజకీయ నేతలను మించిన లౌక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తనకు సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ బయటకు రావడంతో.. ఆయన కొంత కాలం సైలెంటయిపోయారు. మూడు రోజుల క్రితం అనారోగ్యమని.. అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన.. డిశ్చార్జ్ అయిన కొన్ని గంటల్లోనే మీడియా ముందుకు వచ్చారు. తన ఆస్తులపై అనేక ఆరోపణలు చేస్తున్నారని.. తనపై సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించారు. అయితే అచ్చం రాజకీయ నేతల్లాగే.. టీటీడీలో అవకతవకలపైనా… తాను చేస్తున్న నగల మాయం ఆరోపణల పైనా సీబీఐ విచారణ జరిపించాల్సిందేనంటున్నారు.
తనకు అన్ని ఆస్తులు.. తాత ముత్తాతల కాలం నుంచి వచ్చినవే కానీ.. తాను సొంతంగా ఏం సంపాదించుకోలేదంటున్నారు. తనకు టీటీడీ రిటైర్మెంట్ ప్రకటించే వరకూ అరవై వేల రూపాయల వేతనం వచ్చేదనన్నారు. ఇరవై నాలుగేళ్లుగా ఆయన అధికారుల అవమానాలను భరిస్తూనే ఉన్నారట. వేయి కాళ్ల మండపం కూల్చివేయడనికి.. ప్రధాన అర్చకుని హోదాలో… రమణదీక్షితులు అంగీకారం ఇచ్చినట్లు గతంలో పత్రాలు బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు మీడియా ముందు మాత్రం… తాను వేయి కాళ్ల మండపాన్ని కూల్చకుండా పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. టీటీడీలో పని చేసి.. ఇటీవలి కాలంలో.. రమణదీక్షితులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విశ్లేషించిన ధర్మారెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసరాజులపై… రమణదీక్షితులు తీవ్రంగా మండిపడ్డారు. ధర్మారెడ్డి హయాంలోనే నాపై రెండుసార్లు హత్యాయత్నం జరిగిందని కూడా చెప్పుకొచ్చారు.
గతంలో శ్రీవారి ఆభరణాలపై విచారణ జరిపిన కమిటీలకు… ప్రధాన అర్చకుని హోదాలో ఎలాంటి ఫిర్యాదులు చేయని.. రమణదీక్షితులు ఇప్పుడు బ్రిటిష్ మన్యూవల్ గురించి కూడా అసువుగా చెప్పేస్తున్నారు. ప్రతాపరుద్రుడు ఇచ్చిన నగలు నేలమాళిగల్లో ఉన్నాయని .. ఆ నిధుల కోసం తవ్వకాలు జరిగాయని చెప్పుకొస్తున్నారు. తనకు పది రూపాయల అక్రమాస్తులు ఉన్నాయని.. నిరూపించినా ఎలాంటి శిక్షకైనా సిద్ధమంటున్నారు. మరి ఆడికారు.. ఇటీవలి కాలంలో కొనుగోలు చేసిన ఆస్తుల కు సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇంత చెప్పినా ఆయన తాను మరణించేవరకూ శ్రీవారి సేవలోనే ఉంటానని.. తనకు రిటైర్మెంట్ లేదంటున్నారు. మొత్తానికి శ్రీవారి సేవలోనే జీవితాన్ని గడిపేసిన రమణదీక్షితులకు..రాజకీయం కూడా బాగానే వంట బట్టిందనే చెప్పాలి.