ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలకు దిగితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కంటెంట్ లేకుండా మాట్లాడరు..! తాజాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై ఉండవల్లి విరుచుకుపడ్డారు. తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈరోజున బ్యాంకుల్లో డబ్బుల్లేకపోతుంటే, ఏ పత్రికలైనా రాస్తున్నాయా అంటూ మండిపడ్డారు. మోడీ మీద లవ్వొచ్చేసిందనీ, అది వస్తే ఎవ్వడూ ఏం చెయ్యలేడనీ, కొట్టినవాడు కొడుకైతే ప్రేమగా దెబ్బను పట్టించుకోమో.. మోడీ వచ్చి తంతున్నా ఆహా అద్భుతంగా కొట్టాడని, మనకి ఇలాంటి ప్రధాని రావాలని అనుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. మోడీ చెప్పేవన్నీ అబద్ధాలనీ, మాట్లాడితే బూతులనీ అన్నారు.
మోడీ ఏదైనా చెయ్యగలరనీ, శవాలని రైల్లో పెట్టి రాష్ట్రమంతా ఊరేగించగలిగినవారు ఏదైనా చెయ్యగలరని ఉండవల్లి అన్నారు. గోద్రాలో జరిగిన అల్లర్లు అక్కడ చనిపోయివారి గురించి జరగలేదనీ, పోస్టుమార్టం అయిపోయిన శవాలను మొత్త రాష్ట్రమంతా ఊరేగించారని ఆరోపించారు. రూలింగ్ పార్టీలో సీఎంగా ఉంటూ శవాలతో రాజకీయాలు చేసి, శాంతిభద్రతలకు విఘాతం కలించడమేంటని మంత్రి హరేన్ పాండ్యా నాడు ప్రశ్నించారనీ, నాల్రోజులకు ఆయన శవమై మారుతీ కారులో కనిపించారన్నారు. ఈయన్ని చంపింది సోహ్రబుద్దీన్ అనీ, ఆయన్నీ చంపేశారనీ, ఆ తరువాత ప్రజాపతి అనేవ్యక్తిని పట్టుకుని ఎవరు చంపారని అడుగుతుంటే… ఈయన్ని కూడా చంపేశారన్నారు. ఇవన్నీ చేయించింది ఎవరా అని తీగ లాగితే డొంకంతా కదిలి.. సాక్షాత్తూ అమిత్ షా బయటకి వచ్చారన్నారు.
ఈ కేసులో అమిత్ షా 11 నెలలు రిమాండ్ లో ఉన్నారన్నారు. మోడీ ప్రధాని కాగానే సీబీఐ వాళ్లు ఈ కేసును విత్ డ్రా చేసుకుని వచ్చేశారని చెప్పారు. ద్వాపర యుగం నాటి రూల్స్ పెట్టుకుని, హిందుత్వ పార్టీ అని చెప్పుకుంటూ, అధికారం కోసం ఏదైనా చెయ్యొచ్చనే పద్ధతులు మోడీ పాటిస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అందుకే ఆందోళన చెందుతున్నారనీ, కేంద్రం తనను ఏదో చెయ్యబొతుందన్నట్టు సీఎం ఈ మధ్య మాట్లాడారని ఉండవల్లి చెప్పారు. భాజపా నుంచి ఏదీ రాదని తాను మొదట్నుంచీ చెబుతూనే ఉన్నాననీ, కానీ రాష్ట్రానికి ఏదో వస్తుందన్న ఆశతో నాలుగేళ్ల నుంచీ పొత్తుగా ఉన్నామని చంద్రబాబు చెప్పారన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి కారణమైన పరిస్థితులపై చర్చ జరిగేలా చూడాలని ఉండవల్లి కోరారు.
మోడీ షా ద్వయం పై చాలా తీవ్రమైన ఆరోపణలే ఉండవల్లి చేశారు. మోడీ శవరాజకీయాల వల్లనే గోద్రా అల్లర్లు జరిగాయన్నారు, ప్రశ్నించిన ఎమ్మెల్యేను హత్య చేయించి 11 నెలలు అమిత్ షా జైల్లో ఉన్నారనీ గుర్తు చేశారు. ఏపీలో సోలోగా ఎదగాలని ప్రయత్నిస్తున్న భాజపా అధినాయకులపై ఉండవల్లి ఇంత తీవ్రంగా విరుచుకుపడితే, దీన్ని తిప్పి కొట్టడం కోసం భాజపా నేతలు స్పందించకుండా ఉంటారా..?