కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీ పెట్టారు. కేసీఆర్ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా … ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలంటూ ఒత్తిడి ప్రారంభించారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రోజున రగడ సృష్టించారన్న కారణంతో … కోమటిరెడ్డి, సంపత్ లపై స్పీకర్ అనర్హతా వేటు వేశారు. దీనిపై వారు కోర్టుకు వెళ్లడంతో… ఆ నిర్ణయాన్ని కోర్టు కొట్టి వేసింది. కానీ శాసన వ్యవస్థలో జోక్యాన్ని కేసీఆర్ అంగీకరించే అవకాశం లేదు. తమ సభ్యత్వాలను పునరుద్ధరిస్తారన్న నమ్మకం… వారికి లేదు. అందుకే…టీఆర్ఎస్‌పై పోరాటానికి పార్టీ మొత్తం కలసి రావాలని కోరుకుంటున్నారు. అందుకోసం కోమటిరెడ్డి చెప్పిన వ్యూహం..
ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలన్న డిమాండ్‌ను కోమటిరెడ్డి తెరపైకి తేవడానికి కారణం కూడా ఉంది. తమపై కేసీఆర్ వేటు వేసినా.. పీసీసీ పూర్తి స్థాయిలో తమకు మద్దతుగా నిలువలేదని.. కోమటిరెడ్డి, సంపత్ భావిస్తున్నారు. అందుకే కొన్నాళ్లు వాళ్లిద్దరూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టిన బస్సుయాత్రలో కూడా పాల్గొనలేదు. ఇప్పుడు సందర్భం కలసి రావడంతో.. తమకు మద్దతుగా పార్టీ మొత్తం కలసి వచ్చేలా చేయడానికి ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాల డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. అయితే పార్టీలో చర్చించకుండా.. దీన్ని కోమటిరెడ్డి దీన్ని మీడియా ముందు చెప్పడమేమిటని..ఇతర ఎమ్మెల్యేలు.. అసంతృప్తికి గురయ్యారు. రాజీనామాలకు ఒక్కరు కూడా సిద్దంగా లేరు.
మూకుమ్మడి రాజీనామాల డిమాండ్.. సీఎల్పీ నేత జానారెడ్డిని కూడా ఇబ్బందుల్లో నెట్టింది. కాదంటే కోమటిరెడ్డికి కోపం వస్తుంది..అవునంటే.. ఇతర ఎమ్మెల్యేలు కలసిరారు. అందుకే.. నేర్పుగా నిర్ణయం హైకమాండ్ చేతుల్లో ఉందని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏ రూపంలో పోరాడాలని హైకమాండ్ నిర్దేశిస్తే అలా పోరాడుతామన్నారు. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయం సొంత పార్టీలోనే కలకలం రేపుతోంది. తమ పదవులు పోతే.. మిగతా ఎమ్మెల్యేలు సైలెంట్‌గా ఉన్నారని.. తమ పరిస్థితే వారికి రావాలని కోమటిరెడ్డి, సంపత్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.