ఎయిర్ ఏషియా కుంభకోణం బయట పడింది. ఓపక్క దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ కు సంబంధించి ఒక ఆడియో టేపును ఓ ఆంగ్ల పత్రిక వెలుగులోకి తెచ్చింది. దాన్లో, రూట్ పర్మిట్ల కోసం ఏదో ఒకటి చేయాలనీ, ఏం చేసైనా సరే పని అయిపోయేలా చూడాలని ఉంది. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వారి సంభాషణల్లో వినిపించింది. టోనీ ఫెర్నాండెజ్, ఇండియా సీఈవో మిట్టు శాండిల్య మధ్య ఓ సంభాషణ నడిచింది. దాన్లో శాండిల్య మాట్లాడుతూ… సమర్థత కలిగిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారనీ, గతంలో ఆయన క్యాబినెట్ లో ఆర్థికమంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రిగా కేంద్రంలో ఉన్నారనీ, చంద్రబాబును జాగ్రత్తగా డీల్ చేస్తే పని అయిపోతుందని వారి మాటల మధ్యలో వచ్చింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం… టోనీ, శాండిల్య మధ్య జరిగిన సంభాషణ మాత్రమే. వారు చంద్రబాబును డీల్ చేశారనీ, డీల్ అయిపోయిందనీ, మంత్రి అశోక్ గజపతి రాజు తమ పని చేశారని కూడా లేదు. చంద్రబాబును పట్టుకుంటే పని కావొచ్చని మాత్రమే వారిద్దరు మాట్లాడుకున్నారు. తమ పనిని ఎలా చేసుకోవాలో మాట్లాడుకున్నారో తప్ప, ఇలా సాధించేశాం, ఇదిగో వీళ్లని అలా మేనేజ్ చేశాం అని లేదు కదా. అయినా, ఎయిర్ ఏషియా కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఎవరు ఏంటనేది తేల్చేందుకు చట్టం తనపని తాను చేస్తోంది.
ఏదైనా వ్యవహారంలో చంద్రబాబు పేరు వినిపించడమే ఆలస్యం.. సాక్షికి పూనకం వచ్చేస్తుంది..! ‘ఏపీ ముఖ్యమంత్రి మరోమారు ఆడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారు’ అని ఎత్తుకుంది! అడ్డంగా దొరికారని సీబీఐ చెప్పిందా.. లేదు కదా.. ఈలోపు ఎందుకీ అత్యుత్సాహం..? ఆ తరువాతి లైన్లోనే.. ‘చంద్రబాబు పేరు సంబాషణల్లో ప్రస్థావనకు వచ్చింది’ అని వారే రాశారు. ప్రస్థావనకు వచ్చినంత మాత్రాన నేర నిరూపణ అయిపోయినట్టా…? ఈ కుంభకోణమంతా హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందని రాశారు. అప్పటికి, ఏపీ ముఖ్యమంత్రి హైదరాబాద్ లోనే ఉన్నారని రాశారు. ఈ రెండు వాక్యాల మధ్యా సాక్షి ఆపాదిస్తున్నదేంటీ..? ఆ సమయంలో సీఎం హైదరాబాద్ లో ఉంటే.. అదే సమయంలో సదరు కుంభకోణానికి సంబంధించిన సమావేశమేదో ఇక్కడే జరిగితే… దానికీ దీనికీ ఏదో లింక్ ఉన్నట్టు ఊహాగానాలు రాసేస్తే ఎలా..?
కుంభకోణం ఏదైనా బయటకి రావాల్సిందే, దాన్లో ఎంత పెద్ద తలకాయలున్నా నేర నిరూపణ జరిగితే శిక్ష పడాల్సిందే. దాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరు, వెనకేసుకురారు. ఈ క్రమంలో విలువలతో కూడిన జర్నలిజం ట్యాగ్ లైన్ తో పనిచేస్తున్న సాక్షి ప్రెజెంటేషన్ ను మాత్రమే ఇక్కడ ప్రశ్నిస్తున్నది. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే… వారి సంభాషణల్లో చంద్రబాబు పేరు వినిపించింది, ఏదో ఒక కీలక సమావేశం హైదరాబాద్ లో పెట్టుకుంటే.. అదే సమయంలో చంద్రబాబు ఇదే నగరంలో ఉన్నారు. ఈ రెండు పాయింట్లనూ ఆధారాలుగా తీసుకుని.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ‘బాబు అవినీతి ఆకాశయానం’ అని వండి వార్చేయడమేనా విలువలతో కూడిన జర్నలిజం..? ఓ పక్క సీబీఐ తన పని తాను చేస్తోంది కదా! కనీసం వారు ఏదో ఒకటి చెప్పేవరకూ.. ఈ ఆడియో టేపుల గురించి వారు స్పందించే వరకూ ఆగితే తప్పేముంది..?