ప్రతిపక్ష నేత జగన్ కి ఎవరిస్తారో ఇలాంటి సలహాలు..? ఎవరు రాసి అందిస్తారో ఇలాంటి స్క్రిప్టులు..? అదేనండీ.. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్.. ఓ కథ వినిపిస్తా అని చదివారు. పాదయాత్రలో ఎవరో ఒకరు ఆయన్ని కలిశారట, జగనన్నా ఈ కథ చదువు అంటూ ఇచ్చారట, దాన్ని పాదయాత్ర చేస్తుండగా చదవి.. ఫెయిర్ చేయమని తన పీయే.కి జగన్ ఇచ్చారట! దాన్ని జగన్ చదివారు. దానిలో కొత్తదనంగానీ, కవితాత్మకతగానీ, కథా వస్తువుగానీ, ఇతివృత్తంగానీ అన్నీ పాతవే..! ప్రతీరోజూ పాదయాత్రలో పరమ రొటీన్ గా జగన్ చేసే విమర్శల మీటర్లోనే అదీ ఉంది.
ఇంతకీ సందర్భం ఏంటంటే… నవ నిర్మాణ దీక్షలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బలహీనతల గురించి పరోక్షంగా ప్రస్థావించిన సంగతి తెలిసిందే. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి చెడు అలవాట్లకూ సావాసాలకూ బానిస కాలేదనీ, నాయకుడంటే భావితరాలకు ఆదర్శంగా ఉండాలని నిర్ణయించుకుని, క్రమశిక్షణ అలవర్చుకున్నా అన్నారు. ఇదే అంశంపై జగన్ స్పందించారు..! అది కూడా తాను స్వయంగా స్పందించానని అనకుండా… ఎవరో రాసిచ్చిన కథ అంటూ చదివి వినిపించారు. చంద్రబాబును ఉద్దేశించి.. ‘చేతికి ఉంగరమూ గడియారమూ ఉండదండీ.. రెండెకరాల నుంచి రూ. 4 లక్షల కోట్లు సంపాదించారండి. ఆయనకి మందు తాగే అలవాటు లేదండీ, కానీ ప్రతీ ఊరిలోనూ మద్యం పారిస్తారండి. ఏ అమ్మాయి వంకా ఆయన చూడలేదండీ.. కానీ, ఈ మాట ఎబ్బెట్టుగా ఉందండీ’ ఇలా గోదావరి యాసలో మాట్లాడుతూ… ఆయన రొటీన్ గా చేసే విమర్శలన్నీ దాన్లో గుదిగుచ్చి మరోసారి విమర్శించారు. ఇసుక నుంచి రాజధాని వరకూ తరహా విమర్శలన్నీ యాస మార్చి చదివారు.
ఇలా చదవితే బాగుంటుందని ఎవరు చెప్పారండీ..? కానీ, ఇలాంటి వెటకారం వల్ల ఒరిగేది ఏముంటుందండీ..? కాసేపు కాలక్షేపానికి బావుంటదండీ. కానీ, చివరాకరికి జనాల్లోకి వెళ్తున్నది ఏటండీ..? తాను వ్యక్తిగత క్రమశిక్షణను అలవాటు చేసుకున్నానని ముఖ్యమంత్రి అంటే… జగన్ కూడా దాని గురించి మాట్లాడితే బావుంటది కదండీ. తనకు ఏ అలవాట్లూ లేవని చంద్రబాబు చెప్తే… తాను కూడా అంతే క్రమశిక్షణలో ఉంటానని మాట్లాడితే అర్థవంతంగా ఉంటాది కదండీ. అంతేగానీ, ఇలా ఎద్దేవా పూర్వకంగా మాట్లాడటం వల్ల… జగన్ రాజకీయ క్రమశిక్షణ ఏంటో అభిమానులకు ఎలా తెలుస్తతదండీ..? జగన్ కూడా తన నిరాడంబరత గురించి చెప్పుకుంటే అందరికీ అర్థమౌద్ది కదండీ..?
చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ మామూలుగా స్పందించి విమర్శిస్తే.. ఏదో కౌంటర్ ఇచ్చార్లే అని సరిపెట్టుకోవచ్చు. పనిగట్టుకుని, స్క్రిప్టు రాయించుకుని, అలవాటు లేని యాసలో ప్రయాస పడి మరీ ఇలా వ్యంగ్యానికి దిగితే… జగన్ ఎందుకు ఇంత అతిగా స్పందిచేస్తున్నారూ, చంద్రబాబు అంతగా ఏమన్నారూ అని ఒకటికి రెండుసార్లు గుర్తు చేస్తున్నట్టు అవడం లేదా అండీ..! ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత భుజాలు తడుముకుంటున్నట్టు ఎవరికివారు అనుకోవడానికి ఆస్కారం ఇచ్చినట్టు లేదా అండీ..! జగన్ కు ఇలాంటి సలహాలూ స్క్రిప్టులూ వ్యూహాలూ ఆలోచనలూ ఎవరిస్తారండీ బాబూ.. ఆయ్..!