తలైవా రజనీకాంత్ తాజా చిత్రం… “కాలా”ను కర్ణాటకలో రిలీజ్ చేసుకోవడానికి ఆ సినిమా యూనిట్ నానా తంటాలు పడుతోంది. కావేరీ వివాదంపై.. రజనీకాంత్…వివాదాస్పదంగా స్పందించడమే దీనికి కారణం. కర్ణాటక ప్రయోజనాలకు వ్యతిరేకంగా రజనీకాంత్ మాట్లాడారని.. అందుకే ఆయన సినిమాను విడుదల కానీయబోమని… కన్నడ సంఘాలు హెచ్చరించాయి. దీంతో ఎగ్జిబిటర్లు సినిమా ప్రదర్శనకు వెనుకడుగు వేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా.. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే కాలా కర్ణాటక హక్కులను భారీ మొత్తానికి అమ్మేశారు. ఇప్పుడు రిలీజ్ ఆగిపోతే… నిర్మాత అయిన ధనుష్‌కి భారీ నష్టం వాటిల్లుతుంది. రిలీజ్ ఆలస్యమైనా నష్టం కోట్లలో ఉంటుంది. అందుకే కర్ణాటకలో విడుదల చేసుకోవడానికి ధనుష్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
“కాలా” విడుదలకు అనుమతి ఇవ్వాలంటూ… కర్ణాటక హైకోర్టులో ధనుష్ పిటిషన్ దాఖలు చేశారు. తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసిన హైకోర్టు… ప్రదర్శించే ధియేటర్లకు మాత్రం భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ధనుష్‌కు కాస్త ఉపశమనం లభించినట్లయింది. కానీ వెంటనే ముఖ్యమంత్రి కుమారస్వామి బాంబు పేల్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాలా విడుదల చేయడం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు మంచిది కాదని నేరుగా చెప్పేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని సర్దిచెప్పుకున్నప్పటికీ… ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యకతి అలాంటి అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాత ఎవరైనా… సినిమా ప్రదర్శనకు ముందుకు వచ్చే అవకాశం ఉండదు. దీంతో పాటు హైకోర్టు ఆదేశాలను ఒక ముఖ్యమంత్రిగా తాను అమలు చేస్తానని.. కాలాను ప్రదర్శించే థియేటర్లకు భద్రత ఏర్పాటు చేస్తామని కుమారస్వామి చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా తాను వ్యతిరేకం అని బహిరంగంగా చెప్పిన తర్వాత .. ఈ మాటలు ఎగ్జిబిటర్లకు ధైర్యాన్ని ఇవ్వవు.
సాక్షాత్తూ ముఖ్యమంత్రి కూడా కాలా రిలీజ్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం… కర్ణాటక ఫిల్మ్ చాంబర్ కూడా.. ఈ సినిమా రిలీజ్‌కు సంసిద్ధంగా లేకపోవడంతో.. ఏడో తేదీన కర్ణాటకలో కాలా ప్రదర్శితం కావడం అనుమానంగానే ఉంది. ప్రభుత్వం ఎంత భద్రత కల్పిస్తామని చెప్పినా.. విధ్వంసం జరిగితే ధియేటర్లకే నష్టం జరుగుతుంది. కన్నడ సంఘాల హెచ్చరికలను కాదని.. రిలీజ్ చేస్తే.. కచ్చితంగా వారు టార్గెట్ చేసుకుంటారు. అందుకే “కాలా”కు కర్ణాటకలో కష్టమే..!