భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య ప్రచ్చన్న యుద్ధం ఇప్పుడు ఓ స్థాయికి చేరిపోయింది. రాజకీయంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. చంద్రబాబును కంట్రోల్ చేయడానికి కేంద్రం అన్ని రకాల ప్రయత్నాలూ చేసింది. బెదిరింపులు, బ్లాక్ మెయిల్స్ అన్నీ పూర్తి చేసింది. పట్టిసీమ దగ్గర్నుంచి.. తిరుమలలో తవ్వకాలంటూ.. ప్రతి దానికి సీబీఐని కలిపి.. నేరుగా చంద్రబాబుకు గురి పెట్టింది. కానీ రాజకీయం తెలిసిన చంద్రబాబు.. మరింత కేంద్రాన్ని రెచ్చగొట్టారు కానీ… ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు కేంద్రం.. కొత్తగా ఓ పాచిక వేసింది. ఎయిర్ ఏషియా అనే సంస్థ .. లంచాలిచ్చి రూట్ పర్మిషన్లు తీసుకున్న విషయంలో.. చంద్రబాబు పేరును వ్యూహాత్మకంగా లీక్ చేసేసింది.
ఎయిర్ ఏషియా అనే విమానయాన సంస్థ దేశంలో కొన్ని కొత్త రూట్లలో విమాన సర్వీసులు ప్రవేశపెట్టుకోడానికి అడ్డదారుల్లో లంచాలిచ్చి పర్మిషన్లు పొందిందని.. ఇటీవల సీబీఐ ఓ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై విచారణకు ఆ సంస్థ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో… ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్, ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో మిత్తూ ఛాండిల్యాల మధ్య సంభాషణలంటూ ఓ ఆడియో టేప్ బయటకు వచ్చింది. అందులో చంద్రబాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. చంద్రబాబుకు ప్రధానమంత్రి అయ్యే స్టామినా ఉందని వారిద్దరూ చర్చించుకున్నారు. చంద్రబాబును పట్టుకుంటే పనైపోతుందన్నట్లు మాట్లాడుకున్నారు. ఎన్డీఏలో టీడీపీ ఉన్నప్పుడు.. కేంద్ర విమానాయాన శాఖ మంత్రిగా అశోక్‌గజపతిరాజు ఉన్నారు. ఆ తర్వాత రాజీనామా చేశారు.
అసలు చంద్రబాబుకు ఏ సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే.. ఆ టేప్‌ను రిలీజ్ చేసి.. కావాలనే .. బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం కేందరం చేస్తోందని టీడీపీకి అర్థం అయింది. వెంటనే… తెలుగుదేశం పార్టీ కూడా కౌంటర్ ఇవ్వడం ప్రారంభించింది. ఏపీ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు… చాలా ఘాటుగానే కేంద్రానికి ఓ హెచ్చరిక పంపారు. పదిహేను రోజుల్లో కేంద్ర ప్రభుత్వం చేసిన ఓ భారీ కుంభకోణాన్ని బయటపెట్టబోతున్నామని.. ఓ అస్మదీయ కార్పొరేట్ సంస్థకు.. ప్రజల సొమ్మును ఎలా దోచిపెట్టారో.. సాక్ష్యాలతో సహా వివరిస్తూ.. కోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
ఎయిర్ ఏషియా విషయంలో చంద్రబాబు పేరు రావడంతో..ఎలా.. కావాలంటే.. అలా వాడుకోవడానికి బీజేపీ, వైసీపీ సిద్ధమైపోయాయి.టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా కుటుంబరావు ఈ ప్రకటన చేశారో.. లేకపోతే నిజంగా ప్రొసీడ్ అవుతారో తెలియదు. కానీ ఏ కొంచెం సంచలనాత్మక విషయం బయటపెట్టినా.. రాజకీయం మాత్రం రంజుగా మారుతుంది. పార్టీల నుంచి ప్రభుత్వాలకు.. వ్యవహారం షిఫ్ట్ అయిపోతుంది.