భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్రమోదీ. నరేంద్రమోదీ అంటే భారతీయ జనతా పార్టీ. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తరవాత పార్టీలో కాస్త సీనియర్లకు ప్రాధాన్యం ఉండేది. కానీ అమిత్ షా ఎప్పుడైతే బీజేపీ అధ్యక్షుడయ్యారో.. అప్పుడే… సీనియర్లకు గడ్డు కాలం ప్రారంభమయింది. మామూలు సీనియర్లు కాదు… భారతీయ జనతా పార్టీకి ఓ రూపు తీసుకొచ్చిన మూల పురుషుల్లాంటి….ఎల్.కె.అద్వానీ, మురళీమనోహర్ జోషి లాంటి వారికే సెగ తగిలింది. 75 ఏళ్ల నిబంధనల అంటూ.. పక్కన పెట్టేశారు. పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవడం తగ్గించేశారు. పార్లమెంటరీ బోర్డులోనూ అడ్వాణీ, జోషీకి స్థానం కల్పించలేదు. ఐదుగురు సభ్యులతో కూడిన సలహా మండలిని ఏర్పాటుచేసి అందులో అడ్వాణీ, జోషీలను చేర్చారు. ఈ మండలి ఒక్కసారి కూడా సమావేశం కాలేదంటేనే .. వారిని ఎంత ఘోరంగా అవమానించారో అర్థం చేసుకోవచ్చు.
త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో.. ముకుళిత హస్తాలతో నమస్కరించిన అద్వానీని.. నరేంద్రమోదీ ఎంత తిరస్కారంగా చూశారో.. దేశం మొత్తం… చూసేసింది. అలాంటిది ఇప్పుడు మోదీ.. ఆ మూలపురుషుల వద్దకే శరణుకెళ్లారు. లోక్సభ ఉపఎన్నికల్లో వరుసగా వస్తున్న ఓటములతో.. ఆ పార్టీలో 2019 టెన్షన్ ప్రారంభమయింది. అందుకే.. ఏ అవకాశాన్ని వదిలి పెట్టకూడదని భావిస్తోంది. 2019 ఎన్నికల్లో ఎల్కే అద్వానీ పోటీ చేస్తే బాగుంటుందని నరేంద్రమోదీ ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు బీజేపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. ఆయనతో పాటు మురళీ మనోహర్ జోషి లాంటి అగ్రనేతలను కూడా ఎన్నికల బరిలో ఉండేలా చూడాలనుకుంటున్నారట. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా అద్వానీని కలిశారని చెబుతున్నారు. అమిత్ షా కూడా.. చర్చలు జరిపారంటున్నారు.
మొదట్లో ఈ సీనియర్లను పక్కన పెట్టాలన్న ఉద్దేశంతోనే 75ఏళ్ల పైబడిన వారిని ఎన్నికలు, పదవులకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అవసరం కాబట్టి.. సడలించుకుంటున్నారు. మోదీ దేశవ్యాప్తంగా బీజేపీకి తప్ప.. మరి ఏ పార్టీకి కూడా ఆమోద యోగ్యమైన ప్రధానమంత్రి కాదు. కావాలంటే.. అద్వానీని కూడా అంగీకరిస్తారేమో కానీ.. మోదీని మళ్లీ పీఠంపై కూర్చొబెట్టడానికి.. మిత్రపక్షాలు కూడా అంగీకరించవు. ఇలాంటి పరిస్థితుల్లో అద్వానీ, జోషి పరిస్థితులను చక్కదిద్దుతారని.. మోదీ ఆశ పడుతున్నారు. అదే సమయంలో మోదీపై వ్యతిరేకత ఉన్న బీజేపీ ఓటర్లు కూడా.. అద్వానీని, జోషి చూసి ఓట్లేస్తారని అంచనా వేసుకుంటున్నారు. అందుకే తాను పక్కన పెట్టేసిన వారి శరణు కోరుతున్నారు మోదీ.. !