భారతీయ జనతా పార్టీకి కళ్లకు ఇప్పుడు మిత్రులు కనిపిస్తున్నారు. వారి అవసరం ఉంటుందన్న విషయం గుర్తుకు వచ్చింది. ఇంత కాలం పోతే పోండి.. ఉంటే ఉండండి.. మా రాజకీయం మేం చేస్తాం అన్న బీజేపీ… ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ప్రాంతీయ పార్టీల అవసరమే దేశంలో లేదన్నట్లుగా చెలరేగిపోయి రాజకీయాలు చేసిన.. నరేంద్రమోదీ, అమిత్ షాలకు ఇప్పుడు తత్వం బోధపడుతోంది. పిల్లినైనా ఇంట్లో బంధించి కొడితే పులిలా తిరుగబడుతుందన్న విషయం వారికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.
రాజకీయాల్లో గెలుపోటములు ఎంత సహజమో… అందులో పండిపోయినా…మోదీ, షా అధికార గర్వంతో అర్థం చేసుకోలేకపోయారు. ఓ సారి ఓడిపోతే.. ఆ పార్టీని మింగేయవచ్చని ఆశపడ్డారు. ఇలా ఒకటి కాదు.. దాదాపు ప్రతి మిత్రపక్షంతోనూ వ్యవహరించారు. ఫలితంగా.. ఇప్పుడు మిత్రులనేవరూ ఎవరూ బీజేపీకి లేరు. ఉన్న వారితో ఉపయోగం లేదు. ఎన్డీఏలో ఉన్నా.. బీజేపీని నమ్మే పార్టీలు లేవు. ఇది ఇప్పుడిప్పుడు వచ్చిన పరిస్థితేమీ కాదు. గత మూడేళ్లగా ఉన్నదే. కానీ కుర్చీ కిందకు నీళ్లొచ్చేసరికి… ఇప్పుడు అమిత్ షా.. మిత్రులంటూ పరుగులు పెడుతున్నారు.
నాలుగేళ్ల పాటు శివసేన అనే మిత్రపక్షం ఉందని గుర్తించని.. అమిత్ షా .. ఇప్పుడు అపాయింట్మెంట్ అడిగి… ఇచ్చిన సమయంలో ఉద్దవ్ ధాకరేను కలిసేందుకు ముంబై వెళ్తున్నారు. ఒక్క ఉద్దవ్ నే కాదు.. మర్చిపోయిన స్నేహితులందర్నీ కలిసేందుకు “సంపర్క్ ఫర్ సమర్థన్ ” అనే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇంత కాలం నిర్లక్ష్యం చేసి..ఎన్నికల ముందు గుర్తొచ్చామా అని.. అమిత్ షా కలిసేవాళ్లంతా.. నిష్ఠూరమాడటం ఖాయమే.
నిజానికి రాజకీయాల్లో అవసరాలే మిత్రులను నిర్ణయిస్తాయి. గెలిచే ఊపు ఉంటే అమిత్ షా … పరుగులు పెట్టాల్సిన పని లేదు. గత ఎన్నికల ముందు ఎలా వచ్చారో అలా వస్తారు. కానీ ఈ సారి అలాంటి పరస్థితి లేదు. కాంగ్రెస్తో ఎవరూ కలవరు.. మేమేం చేసినా పడతారు అనుకునే వ్యూహంతో రెచ్చిపోయారు. అదే చేటు చేసింది. పార్టీలను కబళించే ప్రయత్నాలు అడ్డంగా దెబ్బ వేసేశాయి. కొత్త పార్టీలు వస్తాయంటే.. పరోక్షంగా సహకరిస్తున్న వైసీపీ, టీఆరఎస్ లాంటివి కూడా.. బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేవు. ఈ పరిస్థితి చూస్తూంటే.. అమిత్ షా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నారన్న సామెతను నిజం చేస్తున్నట్లే ఉంది. కానీ ఏమీ చేయకుండా ఉండటం కన్నా.. అదైనా చేయడం బెటర్ కదా అనుకుంటున్నారు.