హిందీ హిట్ ‘క్వీన్’ తెలుగు రీమేక్‌కి ‘దటీజ్ మహాలక్ష్మి’ టైటిల్ ఖరారు చేసినట్టు నిర్మాత నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఇదేమీ కొత్త విషయం కాదు. కొన్ని రోజులుగా అనుకుంటున్నదే. దర్శకత్వ బాధ్యతలను ‘అ!’తో ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ చేతుల్లో పెట్టినప్పుడే సినిమా టైటిల్ మారింది. కథలోనూ కొన్ని మార్పులు జరిగాయి. అయితే… టైటిల్ మారిన సంగతిని అనౌన్స్ చేసిన నిర్మాత, తెలుగు వెర్షన్‌కి ఎవరు దర్శకత్వం వహిస్తున్నారన్న విషయాన్ని అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం మైసూర్లో తెలుగు, తమిళ, కన్నడ ‘క్వీన్’ రీమేక్స్ షూటింగ్ జరుగుతోంది. సెట్స్‌లో ప్రశాంత్ వర్మ వున్నార్ట. తెలుగు వెర్షన్‌ని అతనే తెరకెక్కిస్తున్నారు కదా! మరి, దర్శకుడిగా అతని పేరు ఎందుకు ప్రకటించలేదు? అని ఆరా తీస్తే… ప్రశాంత్ వర్మకి ఇష్టం లేదట! ఆల్రెడీ ‘క్వీన్’కి ఇద్దరు దర్శకులు మారారు. మొదట నీలకంఠ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది. తమన్నాతో మనస్పర్థలు రావడంతో ఆయన తప్పుకున్నారు. తరవాత తమిళ, కన్నడ రీమేక్స్‌ని డైరెక్ట్ చేస్తున్న రమేష్ అరవింద్ చేతిలో తెలుగు సినిమాను పెట్టారు. మూడు సినిమాల బరువు మోయలేనని అతను తప్పుకోవడంతో ప్రశాంత్ వర్మ వచ్చి చేరారు. వాళ్ళిద్దరూ కొంత దర్శకత్వం చేయడం వలన ‘దటీజ్ మహాలక్ష్మి’ దర్శకుడిగా తన పేరును చెప్పుకోవడం ప్రశాంత్ వర్మకి ఇష్టం లేదని తెలుస్తోంది. విడుదల సమయంలో అయినా చెబుతారో? లేదో?