ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు గుజరాత్లో నిర్మిస్తున్న ధొలెరా నగరంపై విస్త్రతంగా చర్చ జరుగుతోంది. లక్ష కోట్ల వ్యయంతో..రెండు లక్షల ఎకరాలతో దాన్ని నిర్మిస్తున్నారని… ఓ న్యూస్ చానల్.. భారీ కవరేజ్ ఇస్తోంది. నేరుగా ధొలెరాకు వెళ్లి అక్కడి నుంచి న్యూస్ ప్రజెంట్ చేస్తోంది. ఎంత గొప్పగా కడుతున్నారో చెబుతోంది. అదే సమయంలో.. అమరావతికి ఎంత అన్యాయం చేస్తున్నారో కూడా… చెప్పుకొస్తున్నారు. డిస్కషన్లు పెట్టి.. బీజేపీ నేతలను పిలిచి మరీ.. ఇరకాటంలోకి నెడుతున్నారు. దీంతో ధొలెరాపై ఆ చానల్ కవరేజ్ అందరికీ నచ్చేసింది. ముఖ్యంగా.. ఏపీకి అన్యాయం జరుగుతోందని.. బీజేపీ అవమానిస్తోందని భావించే వాళ్లందరికీ నచ్చేసింది.
వెంటనే ఇంకో చానల్ రంగంలోకి దిగింది. “ధొలెరా”పై ఏడుపులెందుకంటూ.. హంగామా ప్రారంభించింది. నవ్యాంధ్ర తొలి చానల్ అంటూ.. రంగం మీదకు వచ్చిన ఆ మీడియా సంస్థ ఇప్పుడు.. ధొలెరాపై నెగెటివ్ ఎపిసోడ్స్ ప్రసారం చేస్తున్న చానల్‌కు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. ఇది న్యూస్ చానళ్లను ఎంటర్టైన్మెంట్గా పరిగణించే వారికి భలే నచ్చేసింది. అందుకే రెండు టీవీ చానళ్లపై బయట కూజా చర్చించేసుకుంటున్నారు.
ఇదంతా బాగానే ఉన్నా.. నవ్యాంధ్రలో తొలి చానల్ అని చెప్పుకుంటున్న మీడియా సంస్థ.. బీజేపీకి బాగా ఊదినట్లు.. ధొలెరాకు ఎందుకు డబ్బా కొడుతుందన్నదే చాలా మందికి అర్థం కావడంలేదు. బేసిగ్గా.. అది రాజకీయాల్లోకి వచ్చిన ఓ నటుడికి మంచి పబ్లిసిటీ ఇస్తుంది. ఆ నటుడు బీజేపీతో కుమ్మక్కయ్యాడనేది చాలా మంది అనుమానం. దానికి తగ్గట్లుగానే ఆ చానల్.. అమరావతిని కించ పరిచేలా.. ధొలెరాను.. పొగుడుతూ కథనాలేస్తోంది. చర్చలు నిర్వహిస్తోంది. పోటీ చానల్‌కు పోటీగా ఇవి పెడుతున్నట్లు బిల్డప్ ఇస్తోంది కానీ.. అంతర్గతంగా మాత్రం చాలా రాజకీయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు మీడియా ఇప్పుడు.. ఎవరి చేతుల్లో ఉంటే వారి కోసమే పని చేస్తోంది. ప్రజల చేతుల్లో లేదు కాబట్టి.. ప్రజల కోసం పని చేయడంలేదు. ఈ చానళ్లు కూడా అంతే . తమ స్టేక్ హోల్డర్స్ ఆసక్తులను… ఇవి నేరవెరుస్తాయి. దీనికి ఫోర్త్ ఎస్టేట్ లాంటి పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు.