బాహుబలి సినిమాకి ఏ మీడియా మోయనంతగా మోసింది ‘ఈనాడు’. ఆ సినిమా సెట్స్‌పై ఉన్న దగ్గర నుంచీ విడుదలైనంత వరకూ.. ప్రతీరోజూ ఏదో ఓ స్పెషల్ ఐటెమ్‌ని వండి వార్చింది. అంతేకాదు… రాజమౌళి ఇంటర్వ్యూ కోసం ఫుల్ పేజీ కేటాయించింది. ఓ సినీ సెలబ్రెటీ ఇంటర్వ్యూకి పూర్తి పేజీ కేటాయించడం ఈనాడు చరిత్రలోనే తొలిసారి. బాహుబలి విడుదల తరవాత కూడా స్పెషల్ కథనాల్ని ప్రచురించింది. ఈ సినిమాలో రామోజీ రావు పెట్టుబడులు ఉన్నాయని, అందుకే ఈ స్థాయిలో ప్రచారం చేసి పెడుతున్నారని అప్పట్లో చెప్పుకున్నారు. నిజానికి రామోజీ రావు పెట్టుబడులేం పెట్టలేదు. ఈ సినిమాకి ఫైనాన్స్ చేశాడంతే. రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 70 శాతం చిత్రీకరణ జరిగింది. దానికి సంబంధించిన సెట్ వర్క్ కి వనరులు అందించింది ఫిల్మ్‌సిటీనే. అందుకే… బాహుబలికి ఈరేంజు పబ్లిసిటీ కట్టబెట్టింది. అయితే.. ఇప్పుడు రామోజీ ఫిల్మ్సిటీకీ.. రాజమౌళికీ క్లాష్ వచ్చినట్టు సమాచారం. దానికీ ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది.
ఫిల్మ్ సిటీ ఖర్చుల బిల్లు చూసి జక్కన్న బృందం షాక్ తిన్నదట. బాహుబలి నిమిత్తం రామోజీ ఫిల్మ్‌సిటీ దాదాపు రూ.90 కోట్ల ఛార్జ్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఆ అంకెలు, వేసిన లెక్కలూ రాజమౌళికి ఏమాత్రం రుచించలేదని తెలుస్తోంది. ఈ విషయంలో ఫిల్మ్‌సిటీ యాజమాన్యంపై రాజమౌళి తన అసహనం వ్యక్తం చేశాడని సమాచారం. బాహుబలి రెండు భాగాల శాటిలైట్ హక్కుల్నీ ఈటీవీకే ఇస్తానని ముందు రాజమౌళి మాటిచ్చాడట. కానీ చివరి నిమిషంలో రాజమౌళి మాట మార్చాడని ఆ సంస్థ కూడా గుర్రుగానే ఉంది. అలా… రాజమౌళికీ రామోజీ సంస్థలకు మధ్య క్లాష్ మొదలైందని తెలుస్తోంది. ఇక మీదట రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగులు చేయకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నాడని, తన తదుపరి సినిమాని వేరే స్టూడియోలో జరుపుకోవాలని భావిస్తున్నాడని సమాచారం. ‘బాహుబలి’కి సంబంధించిన కొన్ని లెక్కలు ఇంకా తేలలేదని.. ఆ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన తర్జన భర్జనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయని సమాచారం.