కడపలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో ప్రతిపక్ష వైకాపాపై విమర్శలు చేశారు. భాజపాతో తాము పొత్తు పెట్టుకున్నది రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమేనని చంద్రబాబు అన్నారు. నాలుగు సంవత్సరాలపాటు ప్రయత్నించాననీ, చివరికి కేంద్రం మోసిందన్నారు. ఆ తరువాత, తిరుగుబాటు ఒక్కటే మార్గమని, ఆ మార్గంలో పోరాటం ప్రారంభించామన్నారు. అయితే, మొదటి రోజే భాజపాతో ఎందుకు విభేదించలేదని కొంతమంది అంటున్నారనీ, విభేదిస్తే నష్టపోయేది మనమేననీ, అన్ని విధాలుగా ప్రయత్నించాలనీ, ఆ పనే తాను కూడా చేశానన్నారు.
వైకాపా గురించి మాట్లాడుతూ.. వీళ్ల కోర్టు కేసుల కోసం, రాజకీయం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం న్యాయమా అని సీఎం ప్రశ్నించారు. ఏపీ ప్రయోజనాల విషయంలో భాజపా ఎంతో ధీమాగా ఇచ్చేది లేదని చెప్పగలిగిందంటే కారణం వైకాపా అని ఆరోపించారు. టీడీపీ పోతే మరో పార్టీ ఉందనే ధీమాతో భాజపా ఉందన్నారు. 2015లో వైకాపా ఎంపీలు రాజీనామాలు చేస్తామన్నారనీ, 2016లో కూడా చేస్తామన్నారనీ, గత ఏడాది కూడా చేస్తామన్నారనీ.. కానీ, మధ్యలో రాష్ట్రపతి ఎన్నికలొస్తే అడక్కుండానే ఎన్డీయేకు మద్దతు ఇచ్చారన్నారు. ఆరోజున రాష్ట్రం గురించి కేంద్రాన్ని వైకాపా ఎందుకు గట్టిగా అడగలేకపోయిందన్నారు. ఎప్పుడైతే, ఐదో బడ్జెట్ వచ్చాక… తాను కేంద్రాన్ని నిలదీయడం మొదలుపెట్టానో, విధిలేని పరిస్థితుల్లో వాళ్లు కూడా బయటకి వచ్చి మాట్లాడాల్సి వచ్చిందన్నారు. వాళ్లు నేరుగా ప్రధాని దగ్గరకి వెళ్తారనీ, అక్కడ విశ్వాసం ప్రకటించేసి.. సభలో అవిశ్వాసం అంటారన్నారు. భాజపాతో తెగతెంపులు చేసుకున్నాకనే తాము అవిశ్వాసం పెట్టామన్నారు. ముందుగా మంత్రులతో రాజీనామా చేయించామనీ, ఆ తరువాత వచ్చిన ఫైనాన్స్ బిల్లులో కూడా న్యాయం జరక్కపోతే ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్నామన్నారు. వైకాపా అవిశ్వాసం పెడితే దేశంలో ఎవ్వరూ మద్దతు ఇవ్వలేదన్నారు.
సీఎం మాటల్లో వాస్తవం ఏంటంటే… ఏపీలో టీడీపీ కాకపోతే మరో పార్టీ తమ వెంట వస్తుందన్న ధీమా భాజపాకి బలంగా ఉంది. అందుకే, ఏపీని ఎంత నిర్లక్ష్యం చేసినా ఏం ఫర్వాలేదన్న ధీమా వారికి పెరిగింది. ఓపక్క మిత్రపక్షం, ఏపీలో అధికార పక్షం పార్లమెంటులో పోరాటం చేస్తుంటే.. మరోపక్క అదే రాష్ట్రానికి చెందిన ప్రతిపక్షం సయోధ్య కోసం మంత్రాంగం నడిపితే ఎవరికైనా ధీమా వస్తుంది కదా! ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నామని జగన్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. కానీ, ఆ పోరాట తీవ్రత కేంద్రానికి తాకనీయకుండా జాగ్రత్తపడుతూ వస్తున్నట్టుగానే వారి ధోరణి ఉంది. ఏపీ విషయంలో కేంద్రం మరింత మొండిగా వ్యవహరించడానికి వైకాపా అనునసరించిన సన్నాయి నొక్కుల ధోరణే కారణం అనేది సత్యం.