కక్కుర్తి అంటే ఇదే. సినిమాకి ఎలాగూ పారితోషికాలు వస్తాయి. సినిమా హిట్టయితే… అవకాశాలు పెరుగుతాయి. దానికి తోడు పారితోషికాలూ భారీగా వస్తాయి. కానీ ఓ దర్శకుడు మేకింగ్ పై దృష్టి పెట్టకుండా ‘కమీషన్లు’ లాక్కోవడంపై శ్రద్ద పెట్టాడు. ఆయన గారి యవ్వారం గురించి టాలీవుడ్లో ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. ఈమధ్య రెండు హిట్లు కొట్టిన దర్శకుడు.. మూడో సినిమాని అట్టర్ ఫ్లాప్‌గా మలచడంలో విజయవంతమయ్యాడు. ఆ సినిమా కూడా స్టార్ హీరోతో తీసిందే. కాకపోతే.. బాక్సాఫీసు దగ్గర భారీగా పల్టీలు కొట్టి అందరినీ నిరాశ పరిచింది.
ఈ సినిమా విషయంలో దర్శకుడిదే తప్పు.. అంటూ అందరూ ముక్త కంఠంతో నిందిస్తున్నారు. సరైన కథ, కథనాలు ఎంచుకోని దర్శకుడు… తనకొచ్చిన అవకాశాన్ని పూర్తిగా పాడు చేసుకున్నాడు.
హిట్లు, ఫ్లాపులు మామూలే. దానికి ఎవరూ అతీతులు కారు. కాకపోతే ఈ దర్శకుడు మాత్రం.. చేచేతులూ ప్లాఫ్ కొని తెచ్చుకున్నాడట. డబ్బు పై వ్యామోహంతో కమీషన్ కక్కుర్తితో సినిమా మొదలై, పూర్తయ్యేలోపు ‘గుంజుడు’ కార్యక్రమంపైనే దృష్టి పెట్టాడని ఆ ప్రభావం మేకింగ్ లోనూ పడిందని టాక్. ‘సినిమా ఇంతలో పూర్తి చేస్తా’ అని నిర్మాత దగ్గర ఓ అంకెకి బేరం పెట్టాడట ఆ దర్శకుడు. నిర్మాత ఇచ్చిన బడ్జెట్లో కొంత మిగుల్చుకోవడంతో పాటు, సాంకేతిక నిపుణులకు ఇచ్చిన పారితోషికాల నుంచి ‘కమీషన్లు’ దక్కించుకున్నాడని టాక్ వినిపిస్తోంది. సంగీతం, ఆర్ట్ విభాగాలకు ఇచ్చిన పారితోషికాల్లో దర్శకుడికి కాస్త వాటా వెళ్లిందని, తన చెప్పు చేతల్లో ఉండేవాళ్లనే టెక్నీషియన్లుగా తీసుకున్నాడని సమాచారం. అలా… కమీషన్ పైనే ఎక్కువ దృష్టి పెట్టడంతో… తన మూడో సినిమా బాక్సాఫీసు దగ్గర ముఫ్ఫై మూడు పల్టీలు కొట్టింది.