కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వెళ్లారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో మర్యాదపూర్వకంగా మాట్లాడారు. అప్పట్నుంచీ టీడీపీ, కాంగ్రెస్ లు పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదంటూ కొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్న సంగతీ తెలిసిందే. ఈ పుకార్లపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మాట్లాడారు.
గత ఎన్నికల్లో తమను తల్లి కాంగ్రెస్ అంటూ హేళన చేశారని రఘువీరా గుర్తుచేశారు. ఎప్పుడూ కాంగ్రెస్ ను ఆడిపోసుకోవడం తప్ప వారికి మరొకటి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉండదన్నారు. చంద్రబాబు, రాహుల్ ఏదో ఒక వేదిక మీద కలిశారనీ, పలకరించుకున్నారు అన్నంత మాత్రాన విపరీత అర్థాలు తీయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు భాజపా ఎంత దూరమో, టీడీపీ ఎంత దూరమో, జగన్ పార్టీ కూడా అంతే దూరమని అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్ణయం ఎలా ఉన్నా, సొంతంగా కాంగ్రెస్ పోటీ చేయాలని తాను వ్యక్తిగతంగా బలంగా కోరుకుంటున్నాననీ, ఎవరితోనూ చేతులు కలపడం ఇష్టం లేదని చెప్పారు.
సో.. కాంగ్రెస్ అభిప్రాయం ఇంత స్పష్టంగా ఉంది. కానీ, ఇప్పటికీ విపక్ష నేత జగన్ మాత్రం… బెంగళూరులో చంద్రబాబు, రాహుల్ పలకరింపులనే పట్టుకుని… కాంగ్రెస్ తో కొత్త కాపురానికి చంద్రబాబు తహతహలాడుతున్నారని ఇప్పటికీ పాదయాత్రలో విమర్శిస్తూనే ఉన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే ట్యాగ్ లైన్ టీడీపీ, కాంగ్రెస్ ల చెలిమికి వర్తించే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే, టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం నుంచి! అంతెందుకు… పక్క రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ తో టీడీపీ కలిస్తే తప్పేముందన్న ప్రతిపాదన తీసుకొస్తే దానిపై ఎంత చర్చ జరిగింది…? పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న తెలంగాణలోనే కాంగ్రెస్ తో పొత్తంటే అసాధ్యమని స్పష్టమైనప్పుడు… ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్చకే ఆస్కారం ఇవ్వరు కదా! రఘువీరా రెడ్డి ఇంత స్పష్టత ఇచ్చాక కూడా ఏపీలో ఇంకా విమర్శలు చేసేవారు ఉంటారా..?