ప్రధాని నరేంద్ర మోడి ఇవ్వాళ్ళ ఉత్తరప్రదేశ్ లోని తన నియోజకవర్గం వారణాసికి, ఆ తరువాత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి నియోజక వర్గమయిన లక్నోకి వెళుతున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇంతవరకు నాలుగుసార్లు ఆయన తన వారణాసి నియోజక వర్గానికి వచ్చేరు. ఇది ఐదవసారి అవుతుంది. వారణాసి పర్యటనలో ఆయన 22మంది వికలాంగులకు అవసరమయిన పరికరాలు అందజేస్తారు. ఆ తరువాత ఈ కార్యక్రమంలో మొత్తం 9274 మంది వికలాంగులకి అవసరమయిన పరికరాలు అందజేయబడతాయి. వారణాసి నుంచి డిల్లీకి మహామన సూపర్ ఫస్ట్ ఎక్స్ ప్రెస్ ని ఆరంభించబోతున్నారు. అది వారణాసి నుండి డిల్లీకి 14 గంటలలోనే చేరుకొంటుంది.
ఆ తరువాత భరత్ పూర్ లో కొన్ని కార్యక్రమాలలో పాల్గొని అక్కడి నుండి ప్రత్యేక విమానంలో లక్నో చేరుకొంటారు. చాలా విచిత్రమయిన విషయం ఏమిటంటే గత 13 ఏళ్లుగా ఏ ప్రధానమంత్రి లక్నో నగరంలో కాలుపెట్టలేదు. కనుక ప్రధాని నరేంద్ర మోడి లక్నో పర్యటనకి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఉత్తరపదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదావ్ ప్రధాని నరేంద్ర మోడికి అక్కడ స్వాగతం పలుకుతారు. కానీ బీజేపీకి, సమాజ్ వాది పార్టీకి మధ్య విభేదాలున్నందున అఖిలేష్ యాదవ్ మోడీకి స్వాగతం పలికి వెళ్ళిపోతారు.
ప్రధాని నరేంద్ర మోడి బాబా సాహెబ్ భీంరావ్ అంబేద్కర్ యూనివర్సిటీలో విద్యార్ధులనుద్దేశ్యించి ప్రసంగిస్తారు. ఆ తరువాత లక్నోలోని కొల్విన్ తాలుక్ దార్ కాలేజీ మైదానంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (నైపుణ్యాభివృద్ధి పధకం) క్రింద ఈ-ఆటోరిక్షాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పధకంలో భాగంగా 3,500 ఈ-ఆటోరిక్షాలు పంపిణీ చేయబడతాయి. ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి ఆటో డ్రైవర్లతో మాట్లాడుతారు. ఆ తరువాత బాబా సాహెబ్ భీంరావ్ అంబేద్కర్ సభలో పాల్గొంటారు. మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకి డిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడికి ఉగ్రవాదుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చినందున ఆయన పర్యటన సందర్భంగా వారణాసి, లక్నోలో చాలా భారీ సంఖ్యలో భద్రతాదళాలను మొహరించబడ్డాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ప్రధాని నరేంద్ర మోడి ఇకపై తరచూ ఆ రాష్ట్రంలో పర్యటించవచ్చును.