ప్రత్యేక హోదా సాధన కోసం చివరి అస్త్రంగా వైకాపా ఎంపీలు రాజీనామాలు చేశారు. అవి కూడా ఎంత కంఫర్టుగా అంటే… ఉప ఎన్నికలు వచ్చేందుకు అవకాశం లేని తరుణం చూసుకుని మరీ రాజీనామాలు చేసేశారనే విమర్శలు చాలా ఉన్నాయి. ఈ విషయంలో కేంద్రంలోని భాజపా కూడా వారికి అనుకూలంగా వ్యవహరించిందనీ, అందుకే రాజీనామాల ఆమోదంపై స్పీకర్ ఇన్నాళ్ల జాప్యం చేశారనే విమర్శలూ ఇప్పుడు మరింత తీవ్రంగా వినిపిస్తున్నాయి. తమ రాజీనామాల ఆమోద విషయమై మరోసారి స్పీకర్ సుమిత్రా మహాజన్ ని బుధవారం నాడు వైకాపా ఎంపీలు కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… రాజీనామాలు ‘ఆమోదం పొందినట్టే’ అని వారే స్వయంగా ప్రకటించేసుకున్నారు. నిజానికి చెప్పాల్సింది వీళ్లు కాదు… స్పీకర్ నుంచి అధికారికంగా ప్రకటన విడుదల కావాలి. బుధవారం అర్ధరాత్రి వరకూ అలాంటి ప్రకటనలేవీ రాలేదు. సరే, ఒకవేళ ఆమోదించినట్టు ప్రకటించినా కూడా ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి అయితే లేదనే నిపుణులు చెబుతున్నారు.
వైకాపా ఎంపీల రాజీనామాల ఆమోదంపై ఓ పది రోజుల కిందట స్పీకర్ ప్రయత్నించి ఉంటే ఉప ఎన్నిక చర్చ ఉండేది. అప్పటికి వారి పదివీ కాలం ఒక సంవత్సరం పది రోజులు ఉంటుంది కాబట్టి..! కానీ, పదిరోజుల పాటు తాత్సారం చేసి… వారి పదవీ కాలం ఏడాది లోపుకు వచ్చే వరకూ జాగ్రత్తగా ఆగి, పునరాలోచన పేరుతో వారికి సమయం ఇచ్చి.. ఇప్పుడు తీరిగ్గా రాజీనామాలు ఆమోదించినట్టుగా కనిపిస్తోంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151 ప్రకారం.. ఏడాదిలోపు సార్వత్రిక ఎన్నికలు రాబోయే పరిస్థితి ఉంటే, ఈలోగా ఉప ఎన్నికలు నిర్వహంచరాదు. ఖాళీ అయిన స్థానాలకి ఆరు నెలలు లోగా ఉప ఎన్నికలు జరపాలనీ చట్టం లో ఉన్నప్పటికీ.. సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు ఖాళీ అయితే ఉప ఎన్నికలు జరగవనేది చాలా స్పష్టంగా అదే సెక్షన్ లో తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ సంప్రదించిన తరువాతే ఇలాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికల నిర్వహణ కష్టం అని కూడా తేల్చి చెప్పినట్టు చట్టంలో ఉంది.
కాబట్టి, వైకాపా ఎంపీలు రాజీనామాలు ఆమోదం పొందినా.. చూసుకుంటే ఏడాదిలోపు ఉప ఎన్నికలు రావడం దాదాపు అసాధ్యమనే చట్టాలు చెబుతున్నాయి. పది రోజుల కిందటే స్పీకర్ ఈ రాజీనామాల ఆమోదం గురించి ప్రయత్నించి ఉంటే… కొంత ఆస్కారం ఉండేది. కానీ, చాలా కంఫర్టుగా ఈ పదిరోజులపాటు వైకాపా ఎంపీలకు ఆలోచించుకునేందుకు సమయం ఇచ్చారు. ఇప్పుడేమో, మేం ఎన్నికలకు రెడీ అని ఎంపీలు ప్రగల్బాలు పలుకుతున్నారు, ఉప ఎన్నికల్లో వైకాపాకి పోటీగా ఇతర పార్టీలు అభ్యర్థుల్ని నిలబెడితే హోదాకు వ్యతిరేకం అని జగన్ ప్రకటిస్తారు! కానీ, వాస్తవంలో చూసుకుంటే ఉప ఎన్నికలు వచ్చేందుకు ఏమాత్రం ఆస్కారం లేకుండా రాజీనామాలు చేశారు, దానికి అనుగుణంగా భాజపా కూడా తనవంతు వ్యూహాత్మక ఆమోద ప్రక్రియను నడిపించింది అనిపిస్తోంది! సో.,. ప్రత్యేక హోదా సాధన కోసం వైకాపా ఎంపీలు చేసిన అత్యంత కంఫర్టబుల్ పదవీ త్యాగ ప్రక్రియ ఈ విధంగా ముగిసింది. దీన్ని త్యాగం అంటారో, పోరాటం అంటారో, అవకాశవాదం అంటారో.. ప్రజలకే తెలియాలి.