తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ ప్రజల నుంచి ఇష్టం వచ్చినట్లు డిపాజిట్లు కట్టించుకున్న సంస్థ అగ్రిగోల్డ్ . తెలుగు రాష్ట్రాల్లోనే వీరి వసూళ్లు ఎక్కువ. వసూలు చేసిన డబ్బులన్నింటినీ… ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికే వెచ్చించారు. కానీ ఈ సంస్థ ఒక్కసారిగా బోర్డు తిప్పేయడంతో.. డిపాజిటర్లు తీవ్రంగా ఇబ్బందుల్లో పడ్డారు. నిజానికి అగ్రిగోల్డ్ లో మదుపు చేసిన వారంతా.. దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్లే. వారికి ఇతర పొదుపు పథకాలపై అవగాహన లేకపోవడం… అగ్రిగోల్డ్ ఏజెంట్లుగా పరిచయస్తులే ఉండటం లాంటి కారణాలతో.. దాదాపు ప్రతి దిగువ మధ్యతరగతి ఇంటిలోకి అగ్రిగోల్డ్ చేరింది. రెక్కలు ముక్కలు చేసుకున్న కష్టం… ఇరుక్కుపోవడంతో వారంతా విలవిల్లాడుతున్నారు.
అగ్రిగోల్డ్ వ్యవహారం మొత్తాన్ని ఇప్పుడు హైకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తోంది. డిపాజిటర్లకు వారి సొమ్ము వారికి ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తోంది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంకు ఎన్ని సార్లు ప్రయత్నించినా.. అంతంత మాత్రం స్పందనే ఉంటోంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా తనకు ఉన్న పరిచయాలతో జీఎస్సెస్ గ్రూప్‌తో సంప్రదింపులు జరిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులు టేకోవర్‌కి ఆ సంస్థ యజమాని సుభాష్ చంద్ర అంగీకరించారు. కోర్టులో రూ. 10 కోట్లు సంస్థ తరపున డిపాజిట్ కూడా చేశారు. కానీ ఏం జరిగిందో కానీ.. తర్వాత తాము వెనక్కి తగ్గుతామని… జీఎస్సెల్ గ్రూపు కోర్టుకు తెలిపింది. ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా… విజయసాయిరెడ్డి జీఎస్సెస్ గ్రూపును బెదిరించారని… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున.. అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న కుటుంబరావు ఆరోపించారు. ఇది నిజమేననేలా.. జీఎస్సెల్ గ్రూప్ కూడా తాము వెనుకడుగు వేయడానికి కారణాలేమిటో చెప్పలేకపోతోంది.
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో… ముఖ్యమంత్రి చంద్రబాబు.. అగ్రిగోల్డ్ డిపాజిటర్ల విషయాన్ని మరింత సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. ఎన్నికలలోపే వారి డిపాజిట్లను వారికి తిరిగి ఇప్పించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దీనిపైనా.. ప్రజల్లో అనుమానాలు కలిగేలా… వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. రూ.35 వేల కోట్ల అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు ప్రారంభించారు. వైసీపీ ఎత్తుగడ… ఎక్కడి కేసు అక్కడ ఉండటమే. దీని వల్ల డిపాజిటర్లు టీడీపీపై అసంతృప్తితో తనకు పడతాయన్న నమ్మకమే. దీని కోసం డిపాజిటర్లను బలిపెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారుని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ చెబుతున్నట్లు… అగ్రిగోల్డ్ ఆస్తులు రూ. 35 వేల కోట్లు అయితే… కేవలం రూ. మూడున్నర వేల కోట్లకే ప్రభుత్వం జగన్‌కు ఇచ్చేస్తుందని.. తీసుకోవాలని కుటుంబరావు సవాల్ చేశారు. దీనిపై వైసీపీ నేతలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు కానీ… బాధితులకు నికరంగా సాయం చేద్దామన్న ఆలోచన మాత్రం చేయడం లేదు.
గతంలో సదావర్తి సత్రం భూముల విషయంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే తరహా గేమ్ ఆడింది. ఎలాంటి పత్రాలు లేని.. కోర్టుల్లో కేసులు ఉన్న చెన్నై సమీపంలోని భూమిని…ఉన్నవి ఉన్నట్లుగా..వేలం వేసింది. అంటే.. కోర్టు తీర్పు ఎలా ఉన్నా తమకు సంబంధం లేదని టెండర్ నిబంధనలు పెట్టింది. దీనిపై వైసీపీ నేతలు రచ్చ చేశారు. వేల కోట్ల భూములని ప్రచారం చేశారు. కోర్టులకు వెళ్లారు. చివరికి పాత వేలం రద్దయింది. కొత్తగా ఎవరూ కొనలేదు. కానీ తమిళనాడు అవి తమ భూములంటూ కోర్టుకెళ్లింది. దాందో అసలు ఏదీ లేకుండా పోయింది. ఇప్పుడు అగ్రిగోల్డ్ విషయంలోనూ వైసీపీ అదే చేస్తోంది. లక్షల మంది డిపాజిటర్లతో ఆడుకుంటోంది. ఎనిమిదో తేదీన హైకోర్టు తీసుకోబోయే నిర్ణయమే.. కీలకం కానుంది.