దూరమైన మిత్రుల్ని దగ్గర చేసుకునేందుకు, మద్దతుగా నిలబడే ప్రముఖుల్ని కూడగట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ “సంపర్క్ ఫర్ సమర్థన్” అనే కార్యక్రమాన్ని ప్రారంచింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సహా… పలువురు ముఖ్యనేతలు ఇప్పుడు … తలా ఓ యాభై మంది జాబితాను రెడీ చేసుకుని వారిని కలిసి… మద్దతు అడుగుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా… ఇప్పటికే బాబా రామ్‌దేవ్, మాధురీదీక్షిత్, రతన్ టాటా లాంటి వాళ్లను కలిసి.. నాలుగేళ్లలో బీజేపీ సాధించిన విజయాలను వివరించి.. వచ్చే ఎన్నికల్లోనూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. తమిళనాడు లాంటి రాష్ట్రాలకు ఇన్చార్జ్గా ఉన్న మురళీధర్ రావు కూడా అక్కడి సినీ ప్రముఖులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మితో సమావేశమయ్యారు. బీజేపీకి మద్దతు అడిగారు. అయితే ఆమె బీజేపీ చేరినట్లు.. ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేసుకున్నాయి. దీన్ని ఆమె ఖండించారు.
వాస్తవానికి భారతీయ జనతా పార్టీ గత నాలుగేళ్ల కాలం… తన రాజకీయ, పాలనా వ్యూహాలతో ఒంటరిగా మిగిలిపోయింది. ఎన్డీఏలోని మిత్రపక్షాలు కూడా.. బీజేపీని నమ్మలేని పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చాక… ప్రతిపక్షాలన్నింటిలోనూ ఐక్యత వచ్చింది. దీంతో ఒక్కసారిగా దేశంలోని వాతావరణం మారిపోయింది. “బీజేపీ వర్సెస్ ఆల్ ” అన్నట్లుగా రాజకీయం మారిపోవడంతో.. బీజేపీ ఉన్నత స్థాయి వర్గాల్లో దడ ప్రారంభమైంది. విపక్షాల ఓట్లన్నీ సమైక్యం అయి.. తాను ఒంటరిగా మిగిలిపోతే.. బీజేపీకి మరోసారి అధికారం కల్ల అనే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
ఈ పరిణామంతో మేలుకున్న అమిత్ షా… “సంపర్క్ ఫర్ సమర్థన్” అంటూ… దూరమైన వారిని మళ్లీ దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గత ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా.. అన్ని వర్గాల ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. ఈ సారి ఆ ఊపు కనిపించడం లేదు. చివరికి శివసేన, జేడీయూ కూడా..వచ్చే ఎన్నికల్లో కలసి నడుస్తాయన్న నమ్మకాలు లేకుండా పోయాయి. వారందరికీ బీజేపీ సాధించిన విజయాలు చెప్పి.. 2019కి మళ్లీ మద్దతు పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో.. నరేంద్రమోదీ కూడా… బీజేపీ తాను నమ్మిన విలువకు దూరంగా వెళ్తోందన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. వాజ్‌పేయి, అద్వానీల బీజేపీ కాదని వస్తున్న విమర్శలకు.. అద్వానీ ద్వారానే చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనను తెర మీదకు తెచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు.
పేరు ఏదైనా బీజేపీ లక్ష్యం ఇప్పుడు.. తమపై ఉన్న నెగెటివ్ ఫీడ్ బ్యాక్‌ను వీలైనంత త్వరగా పాజిటివ్‌గా మార్చుకోవడం. మూడేళ్ల పాటు.. పెద్దగా లేని అధికార వ్యతిరేకత.. ఒక్క ఏడాదిలోనే.. ఓటమి ముంగిటకు తెచ్చి పెట్టడం కమలనాథుల్ని కలవరపరుస్తోంది. ఇప్పుడా వ్యతిరేకతను…”సంపర్క్ ఫర్ సమర్థన్” తో అధిగమించాలనేది..మోదీ, షా ప్రయత్నాలు. సఫలమైతేనే.. 2019లో ఆశలు…!