వ్రతం చెడ్డా ఫలితం ఉండాలని వెనకటికో సామెత. ఫలితం రాబట్టుకోవడం కోసం ఏ వ్రతమైనా చెడగొట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందితే జుత్తు, అందకపోతే కాళ్లు అందుకోవడానికైనా వెనకాడరు అన్నట్టుగా భాజపా అధ్యక్షుడు అమిత్ షా వ్యవహార శైలి ఉంది! దేశమంతా కాషాయమయం అయిపోతోందన్న అతి విశ్వాసంతో ప్రాంతీయ పార్టీలను చిన్నచూపు చేశారు. కానీ, వరుసగా జరిగిన ఉప ఎన్నికలు, కర్ణాటక ఎన్నికల ఫలితాల వల్ల వాస్తవాలు మెల్లగా తెలిసొస్తున్నాయి. దీంతో దూరం చేసుకున్నవారిని బుజ్జగించేందుకు అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు అనొచ్చు. సహజ మిత్రపక్షం శివసేనను మరోసారి కలుపుకుందామన్న ఉద్దేశంతో ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రేతో అమిత్ షా భేటీ అయ్యారు. ఆయనే స్వయంగా ముంబై వచ్చి మరీ థాక్రేని కలిశారు.
అయితే, శివసేన ఏం చేసిందీ… ‘మేము రమ్మని ఆయన్ని పిలవలేదూ, ఆయనే వస్తామని అపాయిట్మెంట్ అడిగారంటూ’ ముందు రోజే ప్రకటించి గాలి తీసేసింది. అయినాసరే, అమిత్ షా వెళ్లి ఉద్ధవ్ థాక్రేని కలుసుకున్నారు. కాసేపు చర్చించారు. ఇంకేం, అమిత్ షా మాయాజాలం వర్కౌట్ అయిపోయిందీ, శివసేనతో మళ్లీ దోస్తీ కుదిరిపోతుందని భాజపా శ్రేణులు కూడా అనుకున్నాయి. కానీ, ఆ తరువాత శివసేన షాక్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో శివసేన సొంతంగానే పోటీకి దిగుతుందనీ, ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకునేది లేదంటూ ఆ పార్టీ ప్రతినిధి, ఎంపీ సంజయ్ రావత్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ఎన్నికల్లో శివసేన ఒంటరిగానే పోటీ చేయాలని జాతీయ కార్యవర్గం నిర్ణయించిందనీ, దానికే కట్టుబడి ఉంటుందని చాలా స్పష్టంగా తేల్చి చెప్పేశారు.
అమిత్ షా గురించి మాట్లాడుతూ… ‘బయట వ్యక్తులు ఎవరో వచ్చి మా నిర్ణయాన్ని ప్రభావితం చేయాలనుకుంటే ఎలా’ అంటూ వ్యాఖ్యానించారు. అమిత్ షా రాకలో ఆంతర్యం తెలుసన్నారు! సో… అమిత్ షా వెంటపడి తమ దగ్గరకి వచ్చారని నిన్న చెబితే, ఆయన వచ్చినా తమను ప్రభావితం చేయలేరని ఇవాళ్ల శివసేన తేల్చి చెప్పింది. అంతేకాదు, అమిత్ షాను ‘ఎవరో బయట వ్యక్తి’ అని సంభోదించడం అంటే అవమానించినట్టే కదా! శివసేనతో మొదలుపెట్టి, మిత్రపక్షాలన్నింటినీ అమిత్ షా కలబోతున్నారని భాజపా నేతలు మొన్ననే చెప్పారు. శివసేనతో బోణీ ఇలా ఉంది. ఇక, ఇతర పార్టీలతో షా మంత్రాంగం ఇంకెలా ఉంటుందో..!