మాజీ రాష్ట్రపతి, సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ వైపే అందరూ చూస్తున్నారు..! ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఆర్.ఎస్.ఎస్.ను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రణబ్, ఇప్పుడు అదే సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి అతిథిగా నాగ్ పూర్ వెళ్లారు. గెడ్జేవార్ ఇంటికి వెళ్లారు, ఆయన జన్మస్థలం సందర్శించారు. అంతేకాదు, ఆయన సమాధి దగ్గరకి వెళ్లి ‘గ్రేట్ సన్ ఆఫ్ మదర్ లాండ్’ అంటూ అక్కడి విజిటర్ బుక్ లో రాశారు. ఇక, ఈ కార్యక్రమంలో ప్రణబ్ ఉపన్యాసం చాలా సమతౌల్యంగా సాగిందని చెప్పుకోవచ్చు. పనిగట్టుకుని ఆర్.ఎస్.ఎస్.ను పొగిడెయ్యాలన్న ధోరణి ఎక్కడా కనిపించలేదు. పరోక్షంగా కూడా అలాంటి సంకేతాలు ఇవ్వలేదనే చెప్పాలి. జాతీయవాదం, దేశభక్తి గురించి మాత్రమే తాను మాట్లాడతానంటూ ప్రణబ్ ప్రసంగం ప్రారంభించారు.
మనదేశం ఎందరో మహానుభావుల జన్మస్థలమన్నారు. మనదేశంలో విద్యాలయాలు ఎంతో గొప్పవనీ, 1800 ఏళ్లపాటు ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి విద్యార్థులను ఆకర్షించాయన్నారు. అంతర్జాతయంగా సిల్క్ రూట్ ద్వారా దేశం ప్రపంచానికి అనుసంధానమైందన్నారు. మన సమాజానికి సహనమే బలం అన్నారు. అసహనం మంచిది కాదనీ, దీని వల్ల దేశానికి ఉన్న గుర్తింపు పోతుందని వ్యాఖ్యానించారు. అసహనం, మతం ద్వారా మనల్ని నిర్వచించుకునే ప్రయత్నం చేసుకుంటే ఉనికి కోల్పోతామని అన్నారు.ఎంతటి సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతాం అన్నారు.
వినిపిస్తున్న విమర్శలకు ఏమాత్రం బలం చేకూరకుండానే ప్రణబ్ మాట్లాడారు. ఆయన నాగ్ పూర్ వెళ్తుంటే, ప్రణబ్ కుమార్తెతో సహా, కాంగ్రెస్ నేతలు చాలామంది తీవ్రంగా తప్పుబట్టారు. సీనియర్ నేత అయిన ఆయన ఎందుకిలా చేస్తున్నారంటూ విమర్శించారు. కానీ, అలా విమర్శించేవారికి మరో అవకాశం ఇవ్వకుండానే ప్రణబ్ జాగ్రత్తపడ్డారు. హిందుత్వ జాతీయవాదం నిండి ఉండే ఆర్.ఎస్.ఎస్.కి.. నెహ్రూవియన్ నేషలిజాన్ని ప్రణబ్ ఉద్భోదించారని చెప్పొచ్చు. దీంతోపాటు రాజ్యాంగ ఔన్నత్యాన్ని చెప్పారు. నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియాలోని కొన్ని మాటలు ప్రస్థావిస్తూ… జాతీయవాదం అనేది హిందు, ముస్లిం, సిక్కులతోపాటు ఇతర సమూహాల ఆలోచనల సమాహారం నుంచి వస్తుందని చెప్పడం విశేషం.
సరే, ఎంత జాగ్రత్తగా మాట్లాడినా ఆర్.ఎస్.ఎస్. కార్యక్రమానికి ఆయన వెళ్లారనేదే ప్రజలకు గుర్తుంటుంది కదా! ఆయన కుమార్తె షర్మిష్టా ముఖర్జీ చెప్పినట్టు… నాగ్ పూర్ వెళ్లి ప్రణబ్ ఏలా మాట్లాడారూ, ఏమ్మాట్లాడారు అనేది ప్రజలకు గుర్తుండదు! ఆర్.ఎస్.ఎస్. కార్యక్రమానికి వెళ్లారని మాత్రమే గుర్తుంటుంది. ఎందుకెళ్లారంటే… దాని వెనక రాజకీయ లక్ష్యం లేకుండా ఎలా ఉంటుందన్న విశ్లేషణలు మాత్రమే ఇకపై వినిపిస్తూ ఉంటాయి. ఆయనకి ప్రధాని కావాలనే కల ఉండిపోయిందన్న సంగతి తెలిసిందే.
ఒకవేళ, 2019 ఎన్నికల తరువాత బొటాబొటీ సీట్లతో ఎన్డీయేకే మరోసారి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం వస్తే… ఆ సమయంలో నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని మిత్రపక్షాలు అంగీకరించే అవకాశం తక్కువగా ఉండొచ్చు. అలాంటప్పుడు, ప్రణబ్ కు అవకాశం దక్కొచ్చు అనే అభిప్రాయాలున్నాయి. అయితే, మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు ఛాన్సే వస్తే… భాజపా నుంచే అభ్యర్థిని ఆర్.ఎస్.ఎస్. ఎంపిక చేస్తుందిగానీ, ప్రణబ్ ను పరిగణనలోకి తీసుకుంటారా అనేవారూ లేకపోలేదు.